ప్రభుత్వ హాస్టల్స్ లో ఉండి చదువుకునే చిన్నారులకు.. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై ఏపీ హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిద్ర లేచింది మొదలు వేలాది కోట్లను బటన్ నొక్కటం ద్వారా అందించే సంక్షేమ ప్రభుత్వం.. చిన్నారులు ఉండే హాస్టల్ నిర్వహణ విషయంలో ఎంతటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నారన్న విషయంపై దాఖలైన పిటిషన్ పై తాజాగా విచారణ జరిపింది.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు జగన్ ప్రభుత్వానికి సూటి ప్రశ్నల్ని సంధించింది. ‘‘హాస్టల్స్ లో విద్యార్థులు కింద పడుకోవాల్సిన పరిస్థితి వస్తే.. మన పిల్లల్ని అక్కడ చేరుస్తారా?’’ అంటూ ప్రశ్నించింది. అంతేకాదు.. పడుకోవటానికి మంచం.. పరుపు ఇవ్వటం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా? అంటూ ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల.. హాస్టల్ లోని అసౌకర్యాలపై సామాజిక కార్యకర్త.. న్యాయవాది పి.బాబ్జీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేవారు.
దీనిపై విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు ధర్మాసనం. ఇందులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్.. జస్టిస్ ఆర్ రఘనందన్ రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ ను విచారించే వేళలో.. ప్రభుత్వానికి సూటి ప్రశ్నల్ని సంధించింది.
‘‘ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితులు చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని అక్కడ చేరుస్తామా?’ అని ప్రశ్నించిన ధర్మాసనం.. ఏపీ వ్యాప్తంగా ఉన్న 190 గురుకుల పాఠశాలల్లోని 1.7 లక్షల విద్యార్థులకు మంచాలు.. నాణ్యమైన పరుపులు ఇచ్చే వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అంతేకాదు.. ఎలాంటి సౌకర్యాల్ని కల్పిస్తున్నారో? దానికి సంబంధించిన చర్యలకు సంబంధించిన నివేదిక తమకు సమర్పించాలని కోరుతూ.. ఉత్తర్వులు జారీ చేయటంతో పాటు.. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. నిత్యం బటన్లతో తమ ప్రభుత్వం అద్భుతాల్ని అందిస్తుందని.. ఏపీ వెలిగిపోతుందని.. ఏపీని ఎక్కడికో తీసుకెళ్లినట్లుగా చెప్పుకునే ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు చెంప పెట్టుగా అభివర్ణిస్తున్నారు. బడి రూపురేఖలు మార్చేశామని.. పిల్లలకు అద్భుతమైన డైట్ ను అందిస్తున్నట్లుగా గొప్పులు చెప్పుకునే జగన్ సర్కారు.. మరి హాస్టల్ లో ఉన్న పిల్లల్ని ఎందుకు గాలికి వదిలేసినట్లు? దారుణమైన పరిస్థితులు.. ఎలాంటి సౌకర్యాలు లేని విధంగా ఎందుకు ఉన్నాయన్న దానిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు.