జూన్ 25, 2021
శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్
విషయం: ఏపిలో చెత్త పన్ను మరి ఇతర అలాంటి పన్నుల బాదుడు గురించి
సూచిక: నవ ప్రభుత్వ కర్తవ్యాలు లేఖ 6
ముఖ్యమంత్రి గారూ,
చక్రవర్తి దిలీపుడు వసూలు చేసే పన్నుల గురించి మహాకవి కాళిదాసు ఒక సందర్భంలో ‘‘ చక్రవర్తి వసూలు చేసే పన్నులు మన మంచికే ఉపయోగపడతాయి. ఎలా అంటే… సూర్యుడు భూమి నుంచి తేమను తీసుకుని దాన్ని పదింతలుగా తిరిగి ఇచ్చినట్లు’’ అని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ లో వసూలు చేస్తున్న పన్నుల గురించి ఆలోచిస్తుంటే నా స్మృతిపథంలో మహాకవి కాళిదాసు మాటలు మెదిలాడాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో దీనికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతున్నది కాబట్టి. ఇక్కడ ప్రజల నుంచి తీసుకోవడమే కానీ వారికి తిరిగి ఇచ్చేది ఏమీ లేని పరిస్థితి నెలకొని ఉన్నది.
మీ తండ్రిగారు, మా అందరి అభిమాన నాయకుడు డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చారు. మీరు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవసాయ విద్యుత్ కు బిల్లులు వసూలు చేయడమే కాకుండా అదనపు స్లాబ్ లు పెట్టి రైతుల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. మీ బిల్లు వసూలు ఎంతలా ఉందంటే ఒక సాధారణ చిన్ని రైతు కూడా నెలకు కనీసంగా రూ.700 విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి వస్తున్నది.
ఎంతో ఆర్భాటంగా మీరు అమలు చేస్తున్న ‘‘జగనన్న సంక్షేమ పథకాలు’’ ద్వారా ఒక పేద కుటుంబానికి, ఆటో రిక్షా కార్మికులకు నెలకు అందుతున్నది రూ.800 నుంచి రూ.1200 మాత్రమే. అయితే ప్రతి కుటుంబం… పేద వారితో సహా పెరుగుతున్న ధరలు, మీరు వేస్తున్న పన్నుల కారణంగా అదనంగా రూ.10,000 ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడి ఉన్నది. మన ప్రభుత్వం ఈ అంశాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. పేదవారిపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పెరిగిన ధరలపై ఎంతో గట్టిగా వాదిస్తుంటే రాష్ట్రంలోని సామాన్య ప్రజలంతా మీ వైపు మొగ్గారు. అప్పుడు ఇంతగా ధరల పెరుగుదల లేకపోయినా కూడా…
2020 నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 196, 197, 198 లను విడుదల చేసింది. ఆ జీవోల ప్రకారం వార్షిక అద్దె విలువ ఆధారిత (ఏఆర్ వి) పద్ధతి నుంచి ఇంటి పన్ను విధానాన్ని మూల విలువ (సివి) ఆధారిత పద్ధతికి మార్చారు. ఈ కొత్త పద్ధతిలో నివాస గృహాలకు మూల విలువ (కాపిటల్ వాల్యూ) లో 0.10 మరియు 0.50 మధ్య ఉంటుంది. అలాగే నివాసేతర భవనాలకు 0.2 మరియు 2 మధ్య ఉంటుంది.
ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు లాభం చేకూరుస్తున్నట్లు చెబుతున్న మీరు, 375 చదరపు అడుగులలో ఇల్లు ఉన్న వారికి కూడా రూ.50 మేరకు ఆస్తి పన్ను వేయడం ఎలా సమర్ధించుకుంటారో నాకు అర్ధం కావడం లేదు. ఇది ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటున్నట్లు కాదా?
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వచ్చే నెల 8 న క్లీన్ ఆంధ్రప్రదేశ్ (సిఎల్ఏపి) అనే కార్యక్రమాన్ని మీరు ప్రారంభిస్తున్నారు.
ఈ కార్యక్రమం కోసం మీరు నెలకు ప్రతి ఇంటి నుంచి రూ.30 వరకూ చెత్త పన్ను వసూలు చేయబోతున్నారు. ఇలా ప్రతి ఇంటి నుంచి రూ.30 వసూలు చేయడం ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేయబోతున్నారు. ఈ కార్యక్రమం పేరు క్లాప్ (CLAP) అని పెట్టినా ప్రజల నుంచి మాత్రం క్లాప్ (చప్పట్లు) ఏ మాత్రం రావడం లేదు సరికదా ఈసడించుకుంటున్నారు.
గత ప్రభుత్వం 60 నెలల కాలంలో 1,30,146.98 కోట్ల రూపాయల మేరకు అప్పులు తీసుకురాగా మన ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూసి ఆర్ధిక వేత్తలే ముక్కున వేలేసుకుంటున్నారు. మీరు ముఖ్యమంత్రి అయిన 24 నెలల్లోనే రూ.1.55 లక్షల కోట్ల కన్నా ఎక్కువగా అప్పులు తీసుకురావడమే కాకుండా భారీ ఎత్తున కొత్త రకాల పన్నులు వేసి ప్రజల్ని కొల్లగొడుతున్నారు.
మీరు చెబుతున్న సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకార్ధంలో అంటే విశ్వాసఘాతక, విధ్వంసకర కార్యక్రమాలుగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు మీరు వాహన మిత్ర స్కీమ్ పేరుతో ఆటో రిక్షా డ్రైవర్లకు నెలకు రూ.10,000 ఇస్తున్నారు. తిరిగి వారి నుంచి మీరు ఎంత కొల్లగొడుతున్నారో తెలుసా? గత ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై ఇచ్చిన రూ.2 రాయితీని కూడా తీసేసి వీరబాదుడు బాదుతున్నారు. అప్పటిలో ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు మండిపోతున్న నేపథ్యంలో కూడా ఎంతో కొంత రాయితీ ఇచ్చారు.
ఇప్పుడు దానికి రివర్స్ లో ఉంది.రాష్ట్రంలో రెవెన్యూ లోటును గణనీయంగా తగ్గించామని ఆర్ధిక మంత్రి చెబుతున్నారు. 2020 – 21 ఆర్ధిక సంవత్సరం ప్రధమార్ధంలో మైనస్ 12.9 శాతం గా ఉన్న రెవెన్యూ లోటును నాలుగో త్రైమాసికానికి మైనస్ 3 శాతానికి తీసుకువచ్చినట్లు ఆర్థికమంత్రి ఎంతో గర్వంగా చెప్పారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇలా విచ్చల విడిగా పన్నులు పెంచడం ఏమిటి? పన్నేతర ఆదాయం గణనీయంగా ఉందని మరో వైపు చెబుతున్నారు కదా?
వేల కోట్ల రూపాయలు అనుత్పాదక పనులపై ఖర్చు చేయడం, ఎలాంటి అభివృద్ధి చూపలేని కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నామని, ఇంటిపన్నులు పెంచడం వల్ల ప్రభుత్వానికి కేవలం రూ.186 కోట్లు మాత్రమే రాబడి వస్తుందని మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం నవ్వు తెప్పిస్తున్నది. గుంటూరు నగరంలో జిందాల్ పవర్ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చేపడుతున్నది. ఇది ముగింపు దశకు వచ్చింది. దీనిద్వారా 15 మెగావాట్ ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
దీనికి గుంటూరు జిల్లాలోని 9 మునిసిపల్ ప్రాంతాల నుంచి చెత్త సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికపై చేపడితే ఇలా ‘‘ చెత్త పన్ను’’ వేయాల్సిన అవసరం ఉండదు కదా? పైగా ఇలాంటి విద్యుత్ ప్రాజెక్టుల నుంచే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దేశంలో చాలా ప్రాంతాలలో ఇదే విధంగా చేసి తమ విద్యుత్ అవసరాలను అతి తక్కువ ఖర్చుతో తీర్చుకుంటున్నారు.
ఔరంగజీబు పాలనలో జిజియా పన్ను వసూలు చేసిన విధంగా మీ పాలనలో కొత్త కొత్త పన్నులు వసూలు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఒక వైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో బాటు మీరు వేస్తున్న పన్నుల భారం అతి తీవ్రంగా ఉంది. పౌరులకు వచ్చే సంపాదనపై జిజియా పన్ను వేసిన ఔరంగజీబు కనీసం మహిళలను, పిల్లలను, వృద్ధులను, అంగవికలురను వదిలేశాడు. మీరు మాత్రం ఎవరినీ వదలకుండా పన్నులు వేస్తున్నారని ప్రభుత్వ యంత్రాంగం గురించి ప్రజలు పలు విధాలుగా అనుకుంటున్నారు.
రాజ్యాంగంలోని 246(3) అధికరణ ప్రకారం ప్రభుత్వానికి పన్నులు వేసే అధికారం ఉన్నా కూడా చెత్తపై పన్ను వేయడం మాత్రం కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి రాదని విజ్ఞులు చెబుతున్నారు. మునిసిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థలు మాత్రమే ఎంటర్ టైన్ మెంట్ మరియు ఎమ్యూజిమెంట్ విభాగం కింద చెత్త పై పన్ను వేసే వీలుఉంటుంది. మీరు ఆ వెసులుబాటును కూడా వారి నుంచి లాక్కుని ఉపయోగించేసుకుంటున్నారు.
మీరు చాలా రకాల ‘‘ఉచిత’’ పథకాలు అమలు చేస్తున్నందున మన ప్రభుత్వానికి నిధుల కొరత తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే. అయితే మీరు రవాణా శాఖ నుంచి అదనంగా ప్రజలపై భారం మోపి రూ.400కోట్లు సంపాదిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు తదితర వాహనాల జీవిత పన్నును దాదాపుగా 3 శాతం మేరకు ఇప్పటికే పెంచేశారు. వస్తు రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నులను కూడా గణనీయంగా పెంచుతున్నారు. కాలపరిమితి తీరిన వాహనాలకు గ్రీన్ టాక్స్ పేరుతో భారీ మొత్తంలో జరిమానా పన్ను వసూలు చేయబోతున్నారు. ఎప్పుడో దశాబ్దం కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రవాణా శాఖ ఈ విధంగా పన్నులు పెంచింది. ఇప్పుడు మళ్లీ మన ప్రభుత్వం అది చేయబోతున్నది.
కొత్త నిబంధన లోని చాప్టర్ 47, 24వ అధ్యాయంలో ఏసు క్రీస్తు చెప్పినట్లు (జెనిసిస్ బైబుల్, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్) ‘‘ పండించిన పంటలో ఐదో వంతు రాజుకు ఇవ్వండి. మిగిలిన నాలుగు వంతులలో ఒక వంతును రాబోయే పంట వేసుకోవడానికి విత్తనాలుగా ఉపయోగించండి. మీరు మీ కుటంబం తినడానికి, మీ పిల్లల భవిష్యత్తుకు ఉంచుకోండి’’ అని ఉటంకించారు.
కనీసం ‘బైబుల్’ కొత్త నిబంధనలో చెప్పిన ఈ సూత్రాన్ని అయినా పాటించాలని నేను మిమ్మల్ని కోరుతున్నారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతిని మీరు వేసే పన్నుల భారం నుంచి కాపాడాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను.
భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు