పార్టీ కోసం కష్టపడే యువ నాయకులకు పెద్దపీట వేయడంలో టిడిపి అధినేత చంద్రబాబు ఎప్పుడు ముందుంటారు. ఆ కోవలోకే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి వస్తారు. జగన్ పాలనను ఎండగడుతూ ప్రజలకు వివరించడంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే జీవి రెడ్డికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫైబర్ నెట్ చైర్మన్ పదవిని చంద్రబాబు అప్పగించారు. చంద్రబాబు అప్పగించిన బాధ్యతలను జీవీ రెడ్డి సమర్థవంతంగా నిర్వహించారు కూడా.
అయితే సంస్థలో కొందరు అధికారులు తనకు సహకరించడం లేదని, సంస్థకు ఆదాయం రావడం లేదని, అందుకు ముగ్గురు, నలుగురు అధికారులే కారణమని జీవి రెడ్డి కొద్దిరోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యవహారం అలా ఉండగానే తాజాగా జీవి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి కూడా జీవి రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిడిపి అధినేత చంద్రబాబుకు జీవీ రెడ్డి పంపించారు.
వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని, ఇకపై న్యాయవాదిగా కొనసాగుతానని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు, ఇకపై ప్రత్యక్ష రాజకీయాలలో ఉండబోనని జీవీ రెడ్డి క్లారిటీనిచ్చారు. తనపై నమ్మకంతో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు జీవీ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ వ్యవహార శైలి వల్లే జీవీ రెడ్డి ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. ఫైబర్ నెట్ లో సంస్కరణలు తెచ్చేందుకు జీవి రెడ్డి ప్రయత్నిస్తూ 400 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశించారు.
కానీ, ముగ్గురు అధికారులతో పాటు దినేష్ కూడా ఆ విషయం పట్టించుకోలేదని, వారిని తొలగించలేదని తెలుస్తోంది. దాంతోపాటు ఈ తొమ్మిది నెలల కూటమి పాలనలో ఒక కొత్త కనెక్షన్ కూడా రాలేదని, సంస్థకు రూపాయి ఆదాయం రాలేదని జీవీ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ పెద్దలతో కలిసి కొందరు అధికారులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, సంస్థకు నష్టం చేకూరుస్తున్నారని జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.