ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తమిళ స్టార్ హీరో విజయ్ కు సినిమా, రాజకీయ జీవితాల్లో పోలికలున్నాయని వారి అభిమానులు అంటుంటారు. అదీగాక, పవన్ సినిమాలు కొన్నింటిని విజయ్ రీమేక్ చేశారు. ఇక, పవన్ మాదిరిగానే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ కూడా రాజకీయాల్లో అడుగుపెట్టారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ టీవీకే పార్టీకి సంబంధించి పవన్ కల్యాణ్ కు ఓ ప్రశ్న ఎదురైంది. ఓ తమిళ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఆ ప్రశ్నకు పవన్ ఆసక్తికర సమాధానమిచ్చారు.
“నేను ప్రత్యేకంగా దృష్టిసారించలేదు. విజయ్ పార్టీ గురించి వాళ్లు, వీళ్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఒకే ఒక్కసారి కలిశాం. రాజకీయాల్లో ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది. ఓపిక, సహనం ఉండాలి. ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా” అని పవన్ జవాబిచ్చారు. ఇటీవల తమిళ రాజకీయాలపై పవన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో హిందీ వ్యతిరేకత వస్తున్న తరుణంలో తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయవద్దంటూ పవన్ చేసిన కామెంట్లు తమిళనాటు కాక రేపాయి.