ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ నేతలపై పవన్ సంచలన విమర్శలు చేశారు. వైసీపీ వాళ్లకు ఇంకా తిమ్మిరి తిమ్మిరిగానే ఉందని, సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని పవన్ మండిపడ్డారు. ఆడబిడ్డలపై నీచంగా మాట్లాడుతున్న వారిని గుర్తించి కొత్తగా రాబోతోన్న సైబర్ ప్రైవసీ చట్టం ద్వారా చర్యలు తీసుకుంటామని, అది ఎలా పనిచేస్తుందో చూపిస్తామని అన్నారు.
వైసీపీ నేతలకు చింత చచ్చినా పులుపు చావలేదని, భవిష్యత్తులో నోట మాట రాకుండా చేస్తానని అన్నారు. వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు మోసం చేయలేదని, 11 సీట్లే వచ్చేసరికి ఈవీంఎలు మోసం చేశాయని ఎద్దేవా చేశారు. “అన్నా… మోసం జరిగింది క్షమించు” అంటూ మళ్లీ దానిపై పాటలు కూడా అంటూ సెటైర్లు వేశారు. నాలుగు నెలలుగా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని, కానీ అవతలి వాళ్లకు నోళ్లు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఇది, మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైనా వైసీపీ వాళ్ల నోళ్లు మూతపడడంలేదని, త్వరలోనే వాళ్ల నోళ్లు మూయిస్తానని పవన్ హెచ్చరించారు.