ఏపీలోని అటవీ సరిహద్దు ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే వారికి ఏనుగుల బెడద తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా పంట చేతికి వచ్చే సమయంలో పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసి పంటను ధ్వంసం చేస్తన్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలోనే కొందరు రైతులు కూడా గాయపడుతున్నారు. ఆ ఏనుగుల దాడిలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇటువంటి నేపథ్యంలో ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. అడవి ఏనుగుల గుంపు దాడులను తిప్పికొట్టేందుకు కర్ణాటక రాష్ట్రం నుంచి 6 కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ కు తెప్పించారు పవన్.
కర్ణాటకలోని విధాన సౌధలో ఈ ఏనుగులను స్వీకరించేందుకు స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో పంట పొలాల్లో, జనావాసాలపై ఏనుగులు చేస్తున్న దాడులతో ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోందని, దానిని నివారించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పవన్ అన్నారు. ఈ క్రమంలోనే రాజకీయాలకు అతీతంగా 6 కుంకీ ఏనుగులను ఏపీకి అందించిన కర్ణాటక ప్రభుత్వానికి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏనుగుల సంరక్షణ బాధ్యతలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని పవన్ హామీనిచ్చారు. అంతేకాదు, కుంకీ ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని పవన్ అన్నారు.
ఎటువంటి సహాయం అడిగిన కర్ణాటక ప్రభుత్వం ముందుకు వస్తోందని పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఇలాగే కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖాండే పాల్గొన్నారు. ఆ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు కర్ణాటక అటవీశాఖ అధికారులు అప్పగించారు. వాటి అప్పగింత, సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్ కళ్యాణ్ కు సీఎం సిద్దరామయ్య అందజేశారు.
పంట పొలాలు, జనావాసాలపై ఏనుగుల గుంపు దాడి చేసే సమయంలో కుంకి ఏనుగులను రంగంలోకి దించుతారు. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేలాగా ఈ కుంకి ఏనుగులకు శిక్షణనిస్తారు. ఏనుగుల గుంపుతో తలపడేలాగా వీటికి ప్రత్యేక శిక్షణనిస్తారు.