శర్మిష్ట పనోలి.. ప్రస్తుతం దేశం మొత్తం ఆమె వైపే చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోతోంది. అసలు ఎవరీ శర్మిష్ట పనోలి..? ఆమె అరెస్ట్ కు కారణం ఏంటి..? ఎందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శర్మిష్ట అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు..? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందం. శర్మిష్ట పనోలి ఒక 22 ఏళ్ల లా విద్యార్థిని మరియు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. పుణెలో చదువుకుంటోంది. అయితే మే 31న హర్యానాలోని గురుగ్రామ్‌లో సీఎం మమతాబెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది.
అయితే శర్మిష్ట పనోలి అరెస్ట్‌పై సార్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్రవాదులకు, పాకిస్థాన్‌కు, మత ఛాందసవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో శర్మిష్ట ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆపరేషన్ సింధూర్‌పై మౌనం వహిస్తున్న బాలీవుడ్ ప్రముఖులను కూడా ఆమె ఏకిపారేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. అయితే వీడియోలో తీవ్ర పదజాలంతో కూడిన శర్మిష్ట వ్యాఖ్యలు మత సముదాయాలను లక్ష్యంగా చేసుకునే విధంగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దాంతో తప్పు తెలుసుకున్న శర్మిష్ట.. వెంటనే వీడియోను డిలీట్ చేసి క్షమాపణలు కూడా చెప్పింది.
అయినప్పటికీ మత విద్వేషాన్ని ప్రేరేపించేలా వ్యాఖ్యానించారని కోల్‌కతా పోలీస్ స్టేషన్ లో శర్మిష్టపై ఫిర్యాదు అందడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు వారెంట్ ఇష్యూ చేశారు. అందులో భాగంగా అమె గురుగ్రామ్‌లో అరెస్టు అయ్యారు. అలిపూర్ కోర్టు ఆమె బెయిల్‌ను తిరస్కరించి, జూన్ 13 వరకు రిమాండ్ విధించింది. అయితే శర్మిష్ట అరెస్ట్ ను బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, డచ్ పార్లమెంటు సభ్యుడు గీర్ట్ విల్డర్స్ వంటి ప్రముఖులు శర్మిష్టకు మద్దతు తెలుపుతున్నారు. కోల్‌కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందని.. వెంటనే శర్మిష్టను విడుదల చేయాలని డచ్ ఎంపీ కోరారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. `శర్మిష్ట తప్పు తెలుసుకుని సారీ చెప్పినా.. పశ్చిమ బెంగాల్ పోలీసులు దూకుడుగా చర్యలు తీసుకున్నారు. మరి ఎన్నికైన నాయకులు, టిఎంసి ఎంపీలు లక్షలాది మంది మనోభావాలను దెబ్బతీస్తూ సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు మీరేం చేశారు? మన విశ్వాసాన్ని `గాంధ ధర్మం` అని పిలిచినప్పుడు ఆ ఆగ్రహం ఎక్కడ ఉంది? వారి క్షమాపణ ఎక్కడ? వారి త్వరిత అరెస్ట్ ఎక్కడ? దైవదూషణను ఎల్లప్పుడూ ఖండించాలి. లౌకికవాదం కొందరికి కవచం కాదు.. మరికొందరికి కత్తి కాదు. ఇది రెండువైపులా ఉండే వీధి అయి ఉండాలి. పశ్చిమ బెంగాల్ పోలీసులను దేశం మొత్తం చూస్తోంది. అందరికీ న్యాయంగా వ్యవహరించండి` అంటూ పవన్ ట్వీట్ చేశారు. `ఐ స్టాండ్ విత్ శర్మిష్ట`, `ఈక్వల్ జస్టిస్` అనే హ్యాష్ ట్యాగ్‌లతో శర్మిష్టకు పవన్ తన మద్దతు తెలిపారు.