ఒకప్పుడు అధిక జనాభా భారమన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు జనాభా అనేది ఒక ఆస్తి అంటున్నారు. జనాభా నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పిన ఆయనే.. కొద్ది రోజుల నుంచి జనాభాను పెంచాల్సిన అవసరం ఉందంటూ పదే పదే ప్రజలను వార్న్ చేస్తున్నారు. జనాభా పెంచేందుకు చట్టాలు తీసుకొస్తామంటున్నారు. తాజాగా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధిరేటుపై సీఎం చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చారు.
ఇప్పటికే చైనా, జపాన్, రష్యా వంటి చాలా దేశాల్లో ఏర్పడిన జనాభా సంక్షోభం మానవాళి మనుగడను సవాల్ చేస్తోంది. ఆయా దేశాల్లో పని చేసేందుకు యువత లేక నానా తిప్పలు పడుతున్నారు. అంతటి తీవ్రమైన సంక్షోభం ఇంకా ఇండియాలో రాలేదు. కానీ వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లలను కనాలని.. యువతరాన్ని పెంచుకోవాలని సూచనలు చేస్తున్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు.. అప్పటికి జనాభా అంచనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయన్నారు. 2031 నుంచి ఏపీలో జనాభా పెరుగుదల రేటు తగ్గే అవకాశం ఉందని.. దేశ జనాభా సైతం 2051 నుంచి తగ్గుముఖం పడుతుందనే అంచనాలు ఉన్నాయన్నారు. ఒక రకంగా ఇది ప్రమాదకరమైన అంశమని.. భావిష్యత్తులో పెద్ద పెద్ద రోడ్లు, ఎయిర్పోర్టులు ఉన్నా జనం ఉండరని చంద్రబాబు అన్నారు.
ముగ్గురు పిల్లలు ఉన్నవారికి ఇప్పటి వరకూ స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో అనర్హత ఉండేది. అయితే దాన్ని తొలగించిన సీఎం చంద్రబాబు.. ఇకపై కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత వచ్చేలా చట్టాలు తెస్తామని చెబుతున్నారు. జనాభా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిమన్నారు. సంపదను సృష్టించే క్రమంలో జనాభాను నిర్లక్ష్యం చేయకూడదని.. జనాభా కూడా ఒక ఆస్తే అన్నారు.