సీఐడీ.. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఇది.. ప్రభుత్వంలో ఒక విభాగం. ప్రజల కోసం.. లేదా.. ప్రభు త్వం కోసం పనిచేయాల్సిన విభాగం. అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నదే. అయితే.. ఈ సంస్థ ఎప్పుడూ వ్యక్తి కోసం .. లేదా ఒక వ్యక్తి కుటుంబం కోసం పనిచేసిన దాఖలాలు లేవు. ఉన్నప్పటికీ.. గుట్టుగానే గోప్యంగానే వ్యవ హరిస్తాయి. అయితే.. ఇప్పుడు ఏపీలో మాత్రం ఓపెన్ అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
సీఎం జగన్ కానీ, ఆయన కుటుంబంపై కానీ.. అంటూ సీఐడీ రాష్ట్ర చీఫ్ సంజయ్ చేసిన ప్రకటన వివాదా నికి దారితీసింది. సీఎం జగన్పై ట్రోల్స్ చేసేవారిని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని.. ఆయన కుటుంబంపై ఆరోపణలు చేసేవారిని ఉపేక్షించేది లేదని.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ చీఫ్ వెల్లడించారు. ఇది రాజ్యాంగం ప్రకారం.. లేదా.. పోలీసు మాన్యువల్ ప్రకారం.. చట్ట విరుద్ధమని మేధావులు, మాజీ ఐపీఎస్లు చెబుతున్నారు.
ఎందుకంటే.. సీఐడీ తీసుకుంటున్న జీతాలు.. రాష్ట్ర ప్రజలు మొత్తంగా కడుతున్న పన్నుల నుంచే తప్ప.. సీఎం జగన్ కానీ, ఆయన కుటుంబం కానీ ఇస్తున్న డబ్బుల నుంచి కాదు. పైగా.. సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టరాదని కూడా సెలవిచ్చారు. అయితే.. సోషల్ మీడియా అనేది భావ వ్యక్తీకరణకు ఒక వేదిక అని.. రెండు మూడు సందర్భాల్లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనిలో పెట్టే పోస్టుల ఆధారంగా వ్యక్తి హక్కులను హరించలేరని కూడా తేల్చి చెప్పింది.
ముఖ్యంగా రాజకీయాలు, ప్రజా జీవితంలో ఉన్నవారిని విమర్శించే హక్కు, వారిని నిశితంగా గమనించే అలవాటు ఉన్న ప్రజలకు ఉంటుందని కూడా కర్ణాటక వర్సెస్ స్టూడెంట్స్ యూనియన్ కేసులో 2021లోనే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరి ఇలాంటి వేదిక ద్వారా ప్రజలు లేదా.. పౌరులు చేసే విమర్శలకు ముకుతాడు వేయాలని.. సీఎం జగన్ కుటుంబంపై ఈగ వాలరాదని.. ఇలాంటి వారి ఆస్తులను సీజ్ చేస్తామని.. కేసులు పెడతామని చెప్పడం ద్వారా. సీఐడీ లక్ష్మణ రేఖలు దాటేస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇది మున్ముందు ఆ సంస్థ పరువును సైతం తీసేసినా.. ఆశ్చర్య పడాల్సిన పనిలేదని చెబుతున్నారు.