ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ మీటింగ్‌లో ఫ్రీ హోల్డ్ లాండ్స్, పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణ పనులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. అలాగే నేటి ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జిల్లాల వారీగా సమావేశం నిర్వహించి స్థలాలు సేకరణపై నిర్ణయాలు తీసుకోవాలని ఇన్చార్జి మంత్రులకు చంద్రబాబు అదేశాలు జారీ చేశారు.
అలాగే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మత్స్యకార భరోసా పథకాల అమలుకు సిద్ధం కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బులు వేసిన వెంటనే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల ఖాతాలో వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయించారు.
మరో 62 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పట్టణాల్లో స్థలం లేకపోతే TIDCO ఇల్లు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.700 కోట్ల రుణం తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రాధాజాని అమరావతి పనులు, పోలవరం డయాఫ్రామ్ వాల్‌ను వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది.