మంత్రి పదవి అనేది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి కల. ఏదో ఒక శాఖకు మంత్రిగా…కుదిరితే ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలాలని అనుకోని పొలిటిషియన్ ఉండరు. అందుకే, మంత్రి పదవి దక్కించుకునేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే ఏపీలో రెండో విడత మంత్రి పదవులపై చాలామంది ఆశావహులు గంపెడాశలు పెట్టుకున్నారు. జగన్ చెప్పిన రెండున్నరేళ్ల డెడ్ లైన్ ముగియడంతో కేబినెట్ విస్తరణ ఎప్పుడని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16న కేబినెట్ విస్తరణకు జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది.
అయితే, కరోనా కారణంతో దాదాపు ఏడాది కాలం లాక్ డౌన్ లు వంటి కార్యక్రమాలతో గడిచిపోయిందని, పాత మంత్రులే ఇంకా సరిగా సెట్ కాలేదని వైసీపీ నేతలు కొందరు అనుకుంటున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్..ల వల్ల విస్తరణకు బ్రేక్ పడే చాన్స్ ఉందని కొందరు అనుకుంటున్నారు. అయితే, పక్క రాష్ట్రాల్లో మాత్రం కరోనా ఉన్నప్పటికీ…. మంత్రివర్గ విస్తరణ వంటి వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారట.
దీంతోపాటు, జగన్ మాటిస్తే అది నిలబెట్టుకుంటారని, రెండో విడతలో చాన్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి న్యాయం చేస్తారని మరో టాక్ ఉంది. మంత్రి పదవి వస్తే తమ సత్తా చూపించాలని, దాంతోపాటు రాబోయే ఎన్నికలనాటికి మంత్రిపదవిలో ఉంటే…అదనపు బలమని అనుకుంటున్నారట. ఇక, కొత్త జిల్లాల ప్రకటన కూడా మంత్రి వర్గ విస్తరణకు సంకేతమని కొందరు అంటున్నారు.
13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయడం ద్వారా మంత్రివర్గ విస్తరణ కూర్పు కూడా సరిగ్గా ఉంటుందని జగన్ భావిస్తున్నారట. రాజకీయ, సామాజిక సమీకరణాల ప్రకారమే కొత్త జిల్లాల, మంత్రివర్గ కూర్పు ఉంటుందని అంటున్నారు. ఉదాహరణకు చిత్తూరు జిల్లా కోటాలో పెద్దిరెడ్డి, నారాయణ స్వామి మంత్రులుగా ఉన్నారు. రెండో విడతలో రోజా మంత్రి పదవి ఆశిస్తున్నారు. బాలాజీ జిల్లాలో నగరిని కలపాలన్న డిమాండ్ నెరవేరితే…రోజాకు పదవి ఖాయం. అయితే, కేబినెట్ విస్తరణకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా…లేదా అన్నది మాత్రం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.