ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం దేశ రాజకీయాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో వైసిపి కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సౌత్ లిక్కర్ సిండికేట్ కు శరత్ సూత్రధారి అని భావించిన ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ లిక్కర్ స్కాంలో ఈడీ విజయసాయిరెడ్డికి మరో షాకిచ్చింది.
తాజాగా, శరత్ చంద్రారెడ్డి భార్య కనికా రెడ్డి ఆధ్వర్యంలోని జెట్ సెట్ గో ఎయిర్ లైన్స్ వివరాలను ఈడీ కోరిన వ్యవహారం సంచలనం రేపుతోంది. ఆ వివరాలను ఆ కంపెనీ ఈడీ అధికారులకు సమర్పించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ కంపెనీ ద్వారా కనికా రెడ్డి ప్రైవేట్ చార్టెడ్ విమానాలను నడుపుతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పో ర్ట్ నుంచి ఈ విమానాల రాకపోకలు సాగుతున్నాయని తెలుస్తోంది.
లిక్కర్ స్కాం వ్యవహారంలో భారీ మొత్తం ముడుపులు ఈ విమానాల ద్వారానే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కంపెనీకి చెందిన విమానాల రాకపోకలు, ప్రయాణికుల వివరాలను ఇవ్వాలంటూ గత నెల 17న ఏఏఐకి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఆ సమాచారాన్ని ఈడీ అధికారులకు ఏఏఐ అందించినట్టుగా తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆ వివరాల ఆధారంగానే శరత్ చంద్రారెడ్డిని అధికారులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఆ కంపెనీ విమానాల ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ నేతల అండతో భారీ మొత్తంలో నగదు ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలినట్టుగా ఈడీ అనుమానిస్తోంది. ఈ కేసులో విచారణ ముందుకు సాగేకొద్దీ మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజా పరిణామంతో లిక్కర్ స్కాంలో సాయిరెడ్డికి మరో షాక్ తగిలినట్లయింది.