చంద్రబాబు పై ఏపీ సిఐడి అధికారులు తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు. అమరావతి అసైన్మెంట్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో 4400 కోట్ల రూపాయల గందరగోళం జరిగినట్టుగా ఆరోపిస్తూ ఈ చార్జ్ షీటు దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా, పురపాలక శాఖ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, సుధీర్ బాబు, ఆంజనేయ కుమార్ లను మిగతా నిందితులుగా సీఐడీ పేర్కొంది. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ పేరుతో వీరంతా కలిసి 1100 ఎకరాల స్థలాన్ని గోల్ మాల్ చేశారని చార్జిషీట్లో పేర్కొన్నారు.
అంతేకాదు, అందుకోసం భూ రికార్డులను కూడా తారుమారు చేశారని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. 2020లో మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. బినామీల సాయంతో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, మంత్రుల హోదాలో నారాయణ ఎస్సీ,ఎస్టీ, బీసీలకు చెందిన భూములు కొన్నారని సిఐడి ఆరోపిస్తోంది. భూములు అమ్మినవారికి ఎటువంటి ప్యాకేజీ చెల్లించలేదని, అతి తక్కువ ధరలకే ఆ భూములను స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తోంది. ఇక, నిషిద్ధ జాబితాలో ఉన్న ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు, జీపీఏ ఇచ్చేందుకు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ వర్గాలపై ఆనాటి మంత్రులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించబోతున్నారని తెలుస్తోంది.
ఎన్నికలకు నెలన్నర రోజుల ముందు ఈ చార్జి షీట్ దాఖలు చేయడంతో చంద్రబాబును మరోసారి అరెస్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.