టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ‘అఖండ’ చిత్రం తర్వాత వరుసగా యువ దర్శకులకు అవకాశం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఇచ్చిన ఊపుతో బాలయ్య…గోపీచంద్ మలినేనితో వీర సింహారెడ్డి ప్రాజెక్టును లైన్లో పెట్టారు. చకచకా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం రాబోయే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలకృష్ణల కాంబోలో సినిమా వాయిదా పడిందని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.
వీర సింహారెడ్డి షూటింగ్ ఆలస్యం కావడం, మరికొద్ది నెలల్లో బాలయ్య పాలిటిక్స్ లో బిజీగా ఉండే అవకాశాలుండడంతో అనిల్ సినిమా లేటయ్యే అవకాశముందని పుకార్లు వచ్చాయి. అంతేకాదు, అనిల్ సినిమాను ప్రస్తుతానికి బాలయ్య పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. వాస్తవానికి ఆ సినిమా షూటింగ్ నవంబర్లో మొదలవ్వాలి. కానీ, ఇంకా వీర సింహారెడ్డి చిత్రంలో కొంత షూటింగ్, ఒక పాట మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, అనిల్ ప్రాజెక్టు లేటవుతుందని అంతా అనుకున్నారు.
ఈ తరుణంలో తాజాగా బాలకృష్ణ, అనిల్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా ముహూర్తం షార్ట్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. డిసెంబర్ 8వ తేదీన ఉదయం 9:36 నిమిషాలకు హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాహు, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీ లీల నటించబోతున్న ఈ చిత్రంలో ప్రియాంకా జవాల్కర్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటించబోతోంది.