ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీల అమలు, తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు గత 40 రోజులుగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే, జగన్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా…అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించి వారిని విధులలో నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. అయితే, ప్రభుత్వ బెదిరింపులకు భయపడని అంగన్వాడీలు సమ్మె విరమించకపోగా…ఈ నెల 24న రాష్ట్ర బంద్ నకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అంగన్వాడీల దెబ్బకు జగన్ సర్కార్ దిగి వచ్చింది.
జీతం పెంపు డిమాండ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, జులైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో అంగన్వాడీలు సమ్మె విరమించారు. అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు సఫలం కావడంతోసమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. జులైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అందుకే తక్షణమే మంగళవారం నుండి విధుల్లోకి చేరుతున్నామని అంగన్వాడీల సంఘం ప్రతినిధులు తెలిపారు.
అంగన్వాడీలపై నమోదైన కేసులను సీఎం జగన్‌తో చర్చించి ఎత్తివేస్తామని బొత్స చెప్పారు. అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.1.20 లక్షలకు, హెల్పర్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.60 వేలకు పెంచామని చెప్పారు. సమ్మె కాలంపై సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తామన్నారు. ప్రకటిస్తామని బొత్స తెలిపారు. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లుగా నిర్ణయించామని, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా మార్చనున్నామని చెప్పారు. మొత్తం 11 డిమాండ్ లలో 10 నెరవేర్చేందుకు అంగీకరించామని, సమ్మె విరమించిన అంగన్వాడీలకు ధన్యవాదాలు అని బొత్స అన్నారు.