ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నో కుటుంబాలను రోడ్డుకు లాగేస్తున్న బెట్టింగ్ యాప్స్ కు మంగళం పాడాలని, బెట్టింగ్ రాయుళ్ల ఆట కట్టించాలని పోలీసులు రంగంలోకి దిగారు. విశాఖ లోకల్బాయ్తో తో మొదలైన షాక్ ట్రీట్మెంట్ ఇప్పుడు హైదరాబాద్ లో హీటు పుట్టిస్తోంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, ఇన్ప్లూయెన్సర్లు, సినీ తారలపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్ వంటి సెలబ్రిటీలపై సైతం కేసులు నమోదు అయ్యాయి.
నోటీసులు, వివరణలు, దర్యాప్తులు అంటూ పోలీసులు సీరియస్ యాక్షన్ మొదలుపెట్టడంతో.. ఒక్కొక్కరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ప్రముఖ హీరోయిన్ అనన్య నాగళ్లపై కూడా కేసు నమోదు అయింది. అయితే అనన్య తన తప్పును ఒప్పుకుంది. `బాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్స్, క్రికెటర్లు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్లు అన్ని చూసుకునే చేస్తారు కదా అనుకున్నాను. అవగాహన లేక, సరిగ్గా ఆలోచించకుండా తానూ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను.
ఒక్క వీడియో స్టోరీ పెట్టినందుకు రూ. 1.2 లక్షలు ఇచ్చారు. అప్పుడు అదొక గేమింగ్ యాప్ మాత్రమే అనుకున్నాను. కానీ అది బెట్టింగ్ యాప్ అని.. దానివల్ల చాలామంది నష్టపోతారని తెలిశాక వాళ్ళు ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకెప్పుడూ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లలేదు` అని అనన్య వివరణ ఇచ్చింది. ఇక ఈ తరుణంలోనే పోలీసులకు షాక్ తగిలేలా అనన్య ఓ లాజిక్ ను తీసింది.
ప్రభుత్వ ప్రాపర్టీ అయినటువంటి మెట్రో ట్రైన్స్ పై బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అనన్య నాగళ్ల.. `ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నామని ప్రభుత్వానికే తెలియకపోతే.. మాకు అది చట్టవిరుద్ధమని ఎలా తెలుస్తుంది?` అని ప్రశ్నించింది. ప్రస్తుతం అనన్య పోస్ట్ కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. అనన్య మాటల్లోనూ లాజిక్ ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ను సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తేనా తప్పా.. ప్రభుత్వం చేస్తే కాదా? అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. చట్టం, న్యాయం అందరికీ సమానంగా ఉండాలని హితవు పలుకుతున్నారు.