బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్.. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత తెలుగులో నటిస్తున్న భారీ చిత్రం ‘ప్రాజెక్ట్-కే’. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్లో గత ఏడాది నుంచి పాల్గొంటున్నారాయన. ఐతే తాజాగా బిగ్-బి అభిమానులకు ఆందోళన కలిగించే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది.
‘ప్రాజెక్ట్-కే’ షూటింగ్లో అమితాబ్ గాయపడ్డారని.. దీంతో షూటింగ్ ఆగిపోయిందని ఈ రోజు ఉదయం నుంచి జోరుగా వార్తలు వచ్చాయి. అన్ని ప్రధాన ప్రింట్, వెబ్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేసింది. 80వ పడికి చేరువ అవుతున్న అమితాబ్ షూటింగ్లో గాయపడ్డారనే సరికి అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
అంత అజాగ్రత్తగా ఎలా చేశారు అనే సందేహాలు కలిగాయి. ఐతే ఈ ప్రమాదం వార్త నిజం కాదంటూ కొన్ని గంటల్లోనే కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. స్వయంగా ‘ప్రాజెక్ట్-కే’ నిర్మాత అశ్వినీదత్ ఈ విషయమై వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఒక మీడియా సంస్థతో అశ్వినీదత్ మాట్లాడుతూ.. తమ సినిమా షూటింగ్లో అమితాబ్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. మూడు రోజుల క్రితమే ఆయన షూటింగ్ పూర్తి చేసుకుని ముంబయికి వెళ్లిపోయారని తెలిపారు. ఈ విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొద్దని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఐతే అమితాబ్‌కు తమ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకోలేదని దత్ అంటున్నారా.. అసలు అమితాబ్‌కు ఏ ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇస్తున్నారా అన్నది అర్థం కావడం లేదు.
బాలీవుడ్ మీడియా సంస్థలు అయితే.. తాను గాయపడినట్లు అమితాబే స్వయంగా వెల్లడించారని.. ‘ప్రాజెక్ట్-కే’ చిత్రీకరణ సందర్భంగానే ప్రమాదం జరిగిందని అంటున్నాయి. మరి ఈ విషయంలో సందిగ్ధతకు తెరదించాల్సింది అమితాబే. సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద జరుగుతుండడం.. అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆయన త్వరలోనే స్పందించే అవకాశముంది.