వరుసగా రెండోసారి దేశంలో అధికారం చేపట్టిన బీజేపీకి ఉత్తరాదిపై గట్టి పట్టున్న సంగతి తెలిసిందే. అయితే, దక్షిణాదిలో మాత్రం బీజేపీ పాగా వేసేందుకు ఎంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ కావడం లేదు. కాస్తో కూస్తో బలం ఉన్న కర్ణాటకలో సైతం బీజేపీ ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో ఓటమిపాలు కావడంతో దాదాపుగా దక్షిణాది తలుపులు బిజెపికి మూసుకుపోయాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది డిసెంబర్లో జరగబోతున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దాంతోపాటు, ఏపీలో కూడా వైసీపీతో మిత్రబంధం చెడిపోయిన నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఇటీవల విశాఖలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రేపు తెలంగాణలో అమిత్ షా పర్యటించేందుకు అమిత్ షా రెడీ అయ్యారు. ఆల్రెడీ తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్న రీతిలో మాటళ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
దీంతో మరోసారి అమిత్ షా….బీఆర్ ఎస్ నేతలపై విరుచుకుపడతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా తన పర్యటనను అమిత్ షా హఠాత్తుగా రద్దు చేసుకున్నారు. గుజరాత్ ను కుదిపేయడానికి సిద్ధంగా ఉన్న బిపర్జోయ్ తుఫాను నేపథ్యంలో ఈ పర్యటన రద్దయింది. గురువారం నాడు తుఫాను గుజరాత్ తీరం దాటనున్న నేపథ్యంలో అక్కడ తుఫాను బీభత్స ఛాయలు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి, ఈ రోజు అర్ధరాత్రి హైదరాబాద్ కు అమిత్ షా చేరుకోవాల్సి ఉంది. రేపు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో భేటీ కావాల్సి ఉంది. ఆ భేటీ తర్వాత టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళితో కూడా షా సమావేశం కావాల్సి ఉంది. వాయిదా పడిన అమిత్ షా పర్యటన ఎప్పుడు ఉంటుందో ప్రకటించాల్సి ఉంది.