బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ను పెంచుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను సవాల్ చేస్తూ బీజేపీ తరుపున ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేలా చేవెళ్ల బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ, తాజా ప్రజాప్రతినిధులు కూడా ఈ లిస్టులో ఉన్నారన్న ప్రచారం జరుగుతుండడంతో అమిత్ షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అమిత్ షా సమక్షంలో వీరు బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్నా దీనిపై ఇప్పటివరకు ఆయా నేతల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు చేవెళ్ల పర్యటన షెడ్యూల్లో అమిత్ షా తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు సమయాన్ని కూడా కేటాయించారు. నోవాటెల్ హోటల్లో తెలంగాణ కోర్ కమిటీ సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నారు. బూత్ కమిటీ ఏర్పాటు, బూత్ సశక్తీకరణ్ కార్య క్రమంలో వెనకబడిన నియోజక వర్గాలు, పార్టీలో లోపించిన కో-ఆర్డినేషన్, ఇటీవల ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ఆతర్వాత ఎంపీ అర్వింద్, బండి మధ్య విభేదాలు, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ నేతలు చెబుతున్నారు.
దీంతో పాటు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంతో అమిత్ షా భేటీ కానుండడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇప్పటికే ఓమారు జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాల భేటీ జరగ్గా.. ఇప్పుడు మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ కానుండడం ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్‌ను ఇప్పటికిప్పుడు బీజేపీలోకి తీసుకురాలేకపోయినా ఆయనతో బీజేపీ నేతల సఖ్యత చూపుతూ ఆయన అభిమానులను ఆకర్షించాలన్నది బీజేపీ ఎత్తుగడగా తెలుస్తోంది.
కాగా అమిత్ షా చేవెళ్లలో ఏం మాట్లాడుతారు.. తెలంగాణ ప్రభుత్వంపైన, కేసీఆర్ కుటుంబంపైన ఎలాంటి ఆరోపణలు చేస్తారు.. ఏం మాట్లాడితే ఎలా తిప్పికొట్టాలనే విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ పెద్దల నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ప్లాన్ అందినట్లు చెప్తున్నరు. దీంతో అమిత్ షా మాట్లాడే అంశాలపై బీఆర్ఎస్ నేతలంతా ఫోకస్ పెట్టారు. సాయంత్రం నుంచి ప్రెస్ మీట్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.