పెళ్లి వేడుక అనగానే ఆ అట్టహాసం.. ఆడంబరం.. బంధువులు, స్నేహితులు, ఆహ్వానితుల జోరు-హుషా రు.. పెళ్లి పెద్దలు.. మేళతాళాలు.. విందు భోజనాలు.. ఫొటోలు.. వీడియోలు.. బంధువర్గం.. అబ్బో ఆ హడావుడే డిఫరెంట్. ఇది మధ్యతరగతి ఫ్యామిలీల్లో కనిపించే సందడి. ఇక, ఆర్థికంగా ఎదిగిన కుటుం బాల్లో అయితే.. పెళ్లికి నాలుగు రోజుల ముందే సంగీత్‌లు, ఫొటో షూట్లు, ప్రత్యేక కార్యక్రమాలు, అతిధు లకు ప్రత్యేక విందులు.. ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇండియాలో ఉన్నవారే ఇలా చేసుకుంటే.. మరి అగ్రరాజ్యం అమెరికాలో ఉన్న మనవారు ఇంకెంత ఆడంబరంగా చేసుకుంటారో ఊహించవచ్చు.
సాధారణంగా.. అమెరికా స్టైల్ వివాహాలకు మన భారతదేశం సంప్రదాయ వివాహాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దీంతో మన వాళ్లు అమెరికాలో చేసుకునే వివాహంపై అక్కడి స్నేహితులు.. మిత్రులు ఆసక్తి కనబరుస్తారు. మన స్టయిల్ విందులు.. ఆహ్వాన పత్రికలు.. బంధువర్గం ఆడంబరాలు వంటివి అమెరికాలో పెద్దగా ఉండవు. దీంతో మన వాళ్లు చేసుకుని వివాహాలకు అక్కడ పెద్ద క్రేజ్. అయితే, ఈ ఏడాది అమెరికాలో ఈ పెళ్లి సందడిపై కరోనా పెద్ద గుదిబండ వేసేసింది. ప్రపంచంలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశంగా ఉన్న అమెరికాలో పెళ్లి వేడుకల పసే పోయింది!
దీనికి ఉదాహరణే ఈ వివాహ ఆహ్వాన పత్రిక! దీనిలో వధువు రేఖ తంగెళ్లపల్లి-వరుడు అమిత్ దేశాయ్‌ల వివాహం అక్టోబరు 31న అని ఉంది. వాస్తవానికి వీరి వివాహం.. నాలుగు మాసాల కిందటే జూన్‌లోనే జరగాల్సి ఉంది. దాదాపు 400 మంది అతిథులు వస్తారని అంచనా కూడా వేసుకున్నారు. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అతిథులకు సరిపోయే విధంగా పెద్ద హాల్‌ను, కళ్యాణ మండపానికి సంబందించిన ఆర్డర్లను కూడా గత ఏడాదే సిద్ధం చేసుకున్నారు. అయితే, వివాహానికి కేవలం రెండు నెలల ముందు పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది.
అమెరికాను కరోనా ఆవరించింది. దీంతో జూన్‌లో జరగాల్సిన వివాహాన్ని అక్టోబరు 31కి వాయిదా వేసుకున్నారు. అంతేకాదు.. కరోనా నిబంధనల నేపథ్యంలో వివాహ వేడుక రూపు రేఖలే మారిపోయాయి. 400 మంది అతిథులతో అంగరంగ వైభవంగా చేయాలనుకున్న వివాహం.. కేవలం 50 మంది అతిథులతో అది కూడా మూతికి మాస్కులు.. భౌతిక దూరం పాటిస్తూ.. ముగించేయాల్సి వచ్చింది. అంతేకాదు.. మూడు ముళ్ల బంధాన్ని పెద్ద హాల్లో వైభవంగా చేసుకోవాలని అనుకున్నప్పటికీ.. కరోనా ఎఫెక్ట్‌తో బహిరంగ ప్రదేశంలో చిన్న మండపం కింద ఎలాంటి సందడీ లేకుండానే మమ అనిఅనిపించేయాల్సి రావడం గమనార్హం.
ఇక్కడ మరో.. చిత్రమేంటంటే.. పోనీ.. వచ్చి న అతి తక్కువ మంది అతిథులకైనా మనసారా ఆకేసి.. పప్పేసి.. నెయ్యేసి.. పెళ్లి విందును వడ్డించే ఛాన్స్ లేకపోవడం!! కరోనా నిబంధనల్లో బహిరంగ భోజనాలపై నిషేధం విధించారు. ఎందుకంటే.. లాలాజలం బయటకు రావడంతోపాటు.. మాస్కులు తీయాల్సి ఉండడంతో కరోనా విస్తరించే అవకాశం ఉందని భావించి భోజనాలపై నిషేధం ఉంది. దీంతో వచ్చిన అతిథులకు ప్యాకేజ్డ్ ఆహారాలను అందించి… సరిపెట్టుకున్నారు. అమెరికాలో జరుగుతున్న మనోళ్ల పెళ్లిళ్లు అన్నీ ఇలానే చడీ చప్పుడు లేకుండా ముగుస్తుండడం గమనార్హం.