మరి కొద్ది గంటల్లో అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల పోలింగ్ మొదలు కాబోతోంది. విజయం కోసం ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. అయితే, కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ముందస్తు పోలింగ్ కు అనుమతినివ్వడంతో ఇప్పటికే దాదాపు సగం మంది ఓటర్లు తమ ఓటుహక్కును ముందస్తు/పోస్టల్ ఓటింగ్ ద్వారా వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పోలింగ్ బూత్‌కు రాలేని వారి కోసం ముందస్తు, పోస్టల్ ఓటింగ్ కల్పించేవారు. కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో సాధారణ పౌరులకూ పోస్టల్, ముందస్తు ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. దీంతో, ఆదివారం నాటికే దాదాపు 45 శాతం ఓట్లు నమోదైనట్లు సర్వేలు చెబుతున్నాయి. మంగళవారం ఓటింగ్ మొదలయ్యే సమయానికి సగానికంటే ఎక్కువ పోలింగ్ జరిగుతుందని అంచనా వేస్తున్నారు. బైడెన్ మద్దతుదారులు ముందస్తు పోలింగ్ కు ఆసక్తి చూపుతున్నారని, ట్రంప్ మద్దతుదారులు ప్రత్యక్ష పోలింగ్ కు సుముఖంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటిదాకా జరిగిన ముందస్తు పోలింగ్ ప్రకారం బైడెన్ వర్గీయులు తమ విజయం పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020 కోసం దాదాపు 23 కోట్ల మంది అమెరికన్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. దాదాపు 150 మిలియన్ల మంది (15 కోట్లు) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం నాటికి దాదాపు 9 కోట్ల మంది ఓటు వేసినట్టు తెలుస్తోంది. అర్హత పొంది ఓటర్లలో దాదాపు 65 శాతం ఓటు వేసే అవకాశముంది. 1908 తర్వాత ఇదే అత్యధిక శాతం ఓటింగ్ కానుందని అంచనా. 2016 ఎన్నికల్లో 13.5 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. టెక్సాస్, హవాయిలలో 2016లో నమోదైన పోలింగ్ శాతం కన్నా ఈసారి అధికంగా పోలింగ్ నమోదైంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. ముఖ్యంగా 18-30 సంవత్సరాల వయసున్న ఓటర్లు, తొలిసారి ఓటు వేస్తున్నవారి ఓట్లు, నల్లజాతివారి ఓట్లు ట్రంప్ నకు వ్యతిరేకంగా పడబోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. సర్వేల ప్రకారం ట్రంప్ పై బైడెన్ దే పైచేయిగా కనిపిస్తోన్నప్పటికీ….ట్రంప్, బైడెన్ ల మధ్య గట్టి పోటీ తప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు.