ఏపీలో కొంతకాలంగా తెలుగు భాష ప్రాముఖ్యత గురించి చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టాలంటూ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. అలా చేయడం వల్ల మాతృభాషను అవమానించడమేనని, విద్యాబోధన మాధ్యమానికి, విద్యార్థుల పురోగతికి సంబంధం లేదని చాలామంది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంతో 1-5వ తరగతి వరకు మాతృభాష అయిన తెలుగులో విద్యాబోధన తప్పనిసరి చేయడంతో జగన్ సర్కార్ కూడా ఆరో తరగతి నుంచి ఇంగ్లిషు మీడియంలో బోధించక తప్పని పరిస్థితి వచ్చింది. ఓ వైపు తెలుగు భాష అత్యధికంగా మాట్లాడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలోనే తెలుగుకు తెగులు పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే…..మరోవైపు, ఇంగ్లిషు మాతృభాషగా ఉన్న అమెరికాలో మాత్రం తెలుగుకు సమున్నత గౌరవం కల్పిస్తున్నారు.
అమెరికా ఎన్నికల ఓటింగ్ సందర్భంగా నిబంధనలు, ఓటింగ్ విధానాలను తెలియజేసేలా వివిధ భాషల్లో బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. వాటిలో మిగతా భాషలతో పాటు తెలుగునూ చేర్చారు. తాజాగా, మరోసారి తెలుగుపై ఉన్న గౌరవాన్ని అమెరికన్ అధికారులు చాటారు. అలమెడా కౌంటీ నివాసితులు తమకు సమీపంలో ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకోగలరు అంటూ తెలుగులోనూ పలు చోట్ల బోర్డు పెట్టారు. నేడు ఓటింగ్ సందర్భంగా అలమెడా కౌంటీలో పలు చోట్ల ఈ తరహాలో ప్రచారం కల్పించారు. ఓటరు బ్యాలెట్ డ్రాప్ బాక్స్ లో సూచనలను హిందీ, తెలుగుతో సహా కొన్నిఅంతర్జాతీయ భాషలలో ప్రచురించారు. దీంతో, అమెరికాలో తెలుగుకు దక్కిన గౌరవం ఏపీలో దొరకడం లేదంటూ తెలుగువారు వాపోతున్నారు. ఏది ఏమైనా దేశ భాషలందు తెలుగు లెస్స అన్న విషయాన్ని ఏపీ సర్కార్ ఎప్పుడు గుర్తిస్తుందో అన్న అభిప్రాయన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.