టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనబోతున్నారు అన్న ప్రచారం మొదలైనప్పటి నుంచి ట్విట్టర్ డీల్ కు సంబంధించిన ప్రతి వార్త సంచలనమే. ట్విట్టర్ డీల్ నుంచి సగంలో మస్క్ వైదొలగడం…ఆ తర్వాత భారీ జరిమానా చెల్లించేందుకు కూడా సిద్ధమవుతున్నారని వార్తలు రావడం తెలిసిందే. ఇక, ఎట్టకేలకు ఆ డీల్ పూర్తి చేయడంతో ట్విట్టర్ కు కొత్త బాస్ గా మస్క్ అవతరించడం చకచకా జరిగిపోయాయి.
అయితే, ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. ట్విట్టర్ సీఈవో పరాగ్ తో పాటు మరి కొంత మంది కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులను మస్క్ తొలగించడం షాకింగ్ గా మారింది. ట్విటర్ లో బ్లూ టిక్ కు డబ్బులు చెల్లించాల్సిందేనంటూ మస్క్ మంకు పట్టుబట్టడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే మస్క్ కు ఆయన మాజీ ప్రేయసి, హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ షాకిచ్చిన వైనం సంచలనం రేపుతోంది.
హెర్డ్ ఖాతా ట్విటర్ లో కనిపించకపోవడం వైరల్ గా మారింది. తన మాజీ భర్త, హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ తో కోర్టు వివాదంలో ఓడిపోయిన ఈ నటి ట్విట్టర్లో తన ఖాతాను డిలీట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే, అంబర్ ఖాతాను మస్క్ డియాక్టివేట్ చేయించారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. లేదంటే మస్క్ కొన్న ట్విటర్ లో ఉండడం ఇష్టం లేక హెర్డ్ స్వచ్ఛందంగా ఖాతా డిలీట్ చేసుకుని వెళ్లిందా అన్న సంగతి ప్రశ్నార్థకంగా మారింది.
మరోవైపు, ట్విటర్ సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొబైల్ యాప్ బాగానే ఉన్నా…వెబ్ బ్రౌజర్ సర్వర్ డౌన్ కావడంతో ఎర్రర్ మెసేజ్ వస్తుందని 94 శాతం మంది ఫిర్యాదు చేశారు. ఇక, ట్విట్టర్లో మరో 3700 మంది సిబ్బందిని మస్క్ తొలగించబోతున్నారు అన్న వార్తలు కూడా సంచలనం రేపుతున్నాయి. దాంతోపాటు వర్క్ ఫ్రం హోం విధానాన్ని కూడా మస్క్ రద్దు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.