టీమిండియా మాజీ క్రికెటర్, వైసీపీ మాజీ నేత అంబటి రాయుడు పేరు కొద్దిరోజులుగా వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీలో చేరి పట్టుమని పది రోజులు కూడా గడవకముందే అంబటి రాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. గుంటూరు లోక్ సభ టికెట్ జగన్ నిరాకరించడంతోనే అంబటి రాయుడు పార్టీని వీడారని తెలుస్తోంది. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని చెప్పిన అంబటి రాయుడు ఆ తర్వాత దుబాయ్ క్రికెట్ లీగ్ లో ఆడుతున్నానని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రం సైలెంట్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో అంబటి రాయుడు భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ రాజీనామా చేసిన అంబటి రాయుడు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. గుంటూరు లోక్ సభ టికెట్ ను అంబటి రాయుడుకు జనసేన కేటాయించబోతున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి.
అంబటి రాయుడు తల్లిదండ్రులకు, రాయుడుకు గుంటూరులో బలమైన మద్దతు ఉండడంతో గుంటూరు జిల్లా నుంచే రాజకీయ అరంగేట్రం చేయాలన్న ఆలోచనలో అంబటి రాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఏ కమిట్మెంట్ తో అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు సాయంత్రానికి జనసేన పార్టీలో ఆయన చేరతారు అంటూ సోషల్ మీడియాలో, మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అంబటి రాయుడు నివాసం దగ్గర సందడి ఏర్పడింది.