ఏడాది ఉద్య‌మం.. దేశ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిందా?

ఒక రోజు కాదు.. ఒక వారం కాదు.. ఏకంగా ఏడాది! రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని.. ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్టాల‌ని నిన‌దిస్తూ... ఎత్తిన  అన్న‌దాత ఉక్కుపిడిలికి ఏడాది పూర్తి. ఇదో ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో ఓ అజ‌రామ‌ర ఘ‌ట్టం. అద్వితీయ అధ్యాయం. ``పోరాడితే.. పోయేదేమీ లేదు..`` అన్నా కార‌ల్ మార్క్స్ స్ఫూర్తితో ఉవ్వెత్తున ఎగిసిన రైత‌న్న‌ల ఉద్య‌మ నినాదం.. ఆ సేతు హిమాచ‌లం వ‌ర‌కు వినిపించింది. ``ప‌దండి ముందుకు.. ప‌దండి తోసుకు..`` అన్న శ్రీశ్రీ వ్యాక్యాలే ఆలంబ‌న‌గా సాగిన ఉద్య‌మ ప‌థం.. నేటికి ఏడాది మైలు రాయి దాటినా.. అదే స్పూర్తినేటికీ.. అణువ‌ణువునా క‌నిపిస్తోంది.. జై అమ‌రావ‌తి నినాదం.. ప్ర‌తి నోటా వినిపిస్తోంది.

``ఆంధ్రుల‌కు పోరాడే శ‌క్తి లేదు! ఇదో చ‌లి మంట‌!`` అని అన్న‌వారు సైతం నివ్వెర పోయేలా.. 2019, డిసెంబ‌రు 17న ప్రారంభ‌మైన ఉద్య‌మం.. నేటికి స‌రిగ్గా.. 365 రోజులు పూర్తి చేసుకుంది. అయితే.. ఇంత భారీ స్థాయిలో రైతులు క‌దం తొక్క‌డం.. ఒక రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం.. న‌డుం బిగించ‌డం.. ఈ రేంజ్‌లో అనేక నిర్బంధాల‌ను, పోలీసుల కేసుల‌ను, ఉక్కుపాదాల చ‌ప్పుళ్ల‌ను భ‌రిస్తూ.. కూడా ముందుకు సాగ‌డం.. గ‌తంలో ఏడాడూ క‌నీ వినీ ఎరుగ‌నిద‌నే చెప్పాలి.

రాష్ట్రంలో అనేక ఉద్య‌మాలు చోటు చేసుకున్నాయి. 2014లో స‌మైక్య ఉద్య‌మం వ‌చ్చింది. కొన్నాళ్లు కొన‌సాగి.. త‌ర్వాత చ‌ప్ప‌బ‌డి పోయింది. ఆ త‌ర్వాత ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం అంటూ.. కొంద‌రు రోడ్డెక్కారు.. త‌ర్వాత వారు కూడా ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే.. వీటికి భిన్నంగా రైత‌న్న‌లు సాగిస్తున్న పోరు.. ముందుకు సాగ‌డం.. దేశ చ‌రిత్ర‌లోనే తొలి ఘ‌ట్ట‌మ‌ని చెప్పొచ్చు.

ఏళ్ల‌పాటు దేశ స్వ‌తంత్ర్య ఉద్య‌మం ముందుకు సాగినా.. దానికీ.. దీనికీ పోలిక‌ల్లో చాలా తేడా ఉంది. ఒక పాల‌న‌పై తిరుగుబాటుతో స్వాతంత్ర్య పోరు సాగితే.. ఒక రాష్ట్రంలో రాజ‌ధాని ఏర్పాటు కోసం.. తాము ఇచ్చిన భూముల‌కు, చేసిన త్యాగాల‌కు న్యాయం చేయాల‌ని నిన‌దిస్తూ.. రైత‌న్న‌లు రోడ్డెక్క‌డం గ‌తంలో ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు. అంతేకాదు.. భూములు ఇవ్వ‌బోమ‌ని భీష్మించిన రైతులు ఉన్నారు.

తామిచ్చిన భూముల‌కు ప‌రిహారం ద‌క్క‌లేద‌న్న అన్న‌దాత‌లు ఉన్నారు. కానీ.. తాము ఎలాంటి ప‌రిహారం ఆశించ‌కుండా.. ఇచ్చిన భూముల్లో రాజ‌ధానిని ఏర్పాటు చేయాల‌ని.. రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగాల‌ని ఆకాంక్షిస్తూ.. ముందుకు సాగుతున్న అన్న‌దాత‌లు మ‌న‌కు ఇక్క‌డ మాత్ర‌మే క‌నిపిస్తున్నారు.

చ‌రిత్ర‌లో క‌లిసిన అనేక ఉద్య‌మాలు ఉన్నాయి. కానీ, అమ‌రావ‌తి ఉద్య‌మం చ‌రిత్ర‌ను సృష్టించింది. దేశంలోని అనేక మంది ప్రాంతాల‌కు అతీతంగా ముందుకు వ‌చ్చి.. సంఘీభావం తెలిపారు. అంతేకాదు.. రాష్ట్రానికి మ‌కుటాయ‌మాన‌మైన అమ‌రావ‌తిని చంపేయ‌డాన్ని గుండెలు బాదుకున్నారు. అలాంటి ఉద్య‌మం.. ఇక‌పై పుడుతుందా? అనేది సందేహమే. ఈ ఉద్య‌మంలో స‌మిధ‌మైన వారే ఎక్కువ‌. కేసులతో వేధించినా.. చేతుల‌కు సంకెళ్లు వేసినా.. ముందుకు సాగారు. ``మేం నిలువునా కాలిపోయినా.. ముందు త‌రాల‌కు మేలు జ‌రిగితే చాలు!`` అనే వ్యాఖ్య‌లే అన్న‌దాత‌ల నోటి నుంచి జాలువారుతున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు 110 మంది అన్న‌దాత‌లు.. అమ‌రావ‌తిపై బెంగ‌తో ప్రాణాలు కోల్పోయారు. మ‌రెంతో మంది దిగులుతో.. దిన‌దిన గండంగా రోజులు గ‌డుపుతున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో క‌నిపిస్తున్న‌దీ.. వినిపిస్తున్నా.. ఐదు కోట్ల ఆంధ్రుల గుండె గోష త‌ప్ప‌.. మ‌రేమీ కాదు!! ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం మారాలి.. అన్న‌దాత‌ల గుండె మంట‌ల ఆవేద‌న‌ల‌ను అర్ధం చేసుకోవాలి!!

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.