రాజధాని అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. గత ఐదేళ్లలో జగన్ పాడుబెట్టిన భవన నిర్మాణాల పటిష్ఠతకు ఎలాంటి ఢోకా లేదని.. స్టీల్, కాంక్రీ ట్ దృఢంగా ఉన్నాయని చెన్నై, హైద రాబాద్ ఐఐటీ లు సీఆర్డీఏకు పూర్తి స్థాయి నివేదిక అందించాయి. పునాదులు చెక్కుచెదరకుండా దృఢంగా ఉన్నందున తదుపరి నిర్మాణ పనులు చేపట్టవచ్చని పేర్కొంది. దీంతో సీఆర్డీఏ అధికారుల్లో ఉత్సాహం నెలకొంది. ఐఐటీలు నెగటివ్‌గా రిపోర్టు ఇస్తే.. అన్ని నిర్మాణాలను మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది.
ఇదంత తేలికైన పనికాదు. ఐకానిక్ సచివాలయ టవర్లనే తీసుకుంటే.. ఐదు టవర్లను రాఫ్ట్ ఫౌండేషన్ టెక్నాలజీతో చేపట్టారు. ఈ పనులు మళ్లీ చేపట్టాలంటే చాలా కష్టం. పైగా ఖర్చు పెరుగుతుంది. అధిక సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో రాఫ్ట్ ఫౌండేషన్‌కు రెండు ఐఐటీ బృందాలూ క్లీన్ చిట్ ఇచ్చాయి. కాంక్రీట్‌లో గానీ, స్టీల్ పటుత్వంలో గానీ లోపాలు లేవని తే ల్చాయి. రాజధాని నిర్మాణాన్ని గత జగన్ సర్కారు అటకెక్కించడంతో సచివాలయ ఐకానిక్ టవర్లు గత ఐదేళ్లుగా నీళ్లలోనే నానుతూ ఉన్నాయి.
మిగిలిన బహుళ అంతస్థుల భవనాల విషయంలో పెద్దగా అనుమానాలు లేకున్నా.. ఐకానిక్ టవర్ల విషయంలోనే అనుమానాలు నెలకొన్నాయి. ఐఐటీ బృందాలు శాస్త్రీయంగా పరిశోధించి టవర్ల కాంక్రీట్, స్టీల్ బాగుందని.. హైకోర్టు భవనం. అఖిల భారత సర్వీసు అధికారులు, ఎన్జీవో భవనాలు, గవర్నమెంట్ టైప్-1, టైప్-2 భవనాలు, ముఖ్య కార్యదర్శుల భవనాలు.. ఇలా అన్నీ సురక్షితంగానే ఉన్నాయని తేల్చాయి. మూడుముక్కలాటతో జగన్ రాజధాని విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ పనులు ప్రారంభించడానికి శాస్ర్తీయంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో రాజధానిలో భవన నిర్మాణ పనులకు సంబంధించి ముందుకు వెళ్లే విషయంలో టెక్నికల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏయే నిర్మాణాలను పరిశీలనలు చేయాలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివే దిక ప్రకారం ఐఐటీలతో పరిశీలన చేయాలని సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు హైదరాబాద్, చెన్నై ఐఐటీలకు బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థలకు చెందిన నిపుణులు అమరావతికి వచ్చి ఐకానిక్ టవర్లు, హైకోర్టు, ఐఏఎస్, ఎన్జీవో తదితర భవనాలన్నిటి కాంక్రీట్, ఐరన్ ముక్కలను కట్ చేసుకుని శాంపిల్స్‌గా తీసుకెళ్లి పరీక్షించాయి. పరీక్షల్లో కాంక్రీట్, స్టీల్ బాగున్నట్లు తేలింది.
ముఖ్యంగా సచివాలయ టవర్లకు సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ దుర్భేద్యంగా ఉందని స్పష్టం చేశాయి. దీంతో సచివాలయ టవర్లు, హైకోర్టు భవనాలకు సంబంధించి పనుల విషయంలో ముందుకు వెళ్లడానికి కన్సల్టెన్సీ నియామకానికి టెండర్లు పిలిచారు. నవంబరు, డిసెంబరు నాటికి పనులు పురోగతిలో ఉండే అవకాశముంది. ఐకానిక్ టవర్లు, హైకోర్టు అసెంబ్లీ, బహుళ అంతస్థుల భవనాలకు సంబంధించి మొత్తం 3,600 ఫ్లాట్ల బ్యాలెన్స్ పనులు, 360 కిలోమీటర్ల ట్రంక్ ఇన్ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ఫ్రా వంటి పనులన్నీ త్వరలోనే ప్రారంభించబోతున్నారు.
ఇప్పటికీ అదే దుష్ప్రచారం..
చంద్రబాబు మళ్లీ రాగానే రాజధాని అమరావతి తిరిగి కళకళాడుతుండడాన్ని మాజీ సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ముంపు ప్రాంతమని నిరంతరం దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. కృష్ణా నదికి మొన్న భారీ వరదలు వచ్చినప్పుడే.. భారీవర్షాలకు బుడమేరు కాలువ భారీగా పొంగి.. అనేక చోట్ల గండ్లు పడి.. బెజవాడ సింగ్‌నగర్, వైఎస్సార్ కాలనీ తదితర ప్రాంతాలు మునిగినప్పుడు.. చంద్రబాబు స్వయంగా వరదలో తిరగడం, బాధితులకు సహాయ కార్యక్రమాలు పెద్దఎత్తున అందేందుకు బెజవాడలోనే మకాం వేయడం చూసి భరించలేకపోయారు. ప్రజల్లో ఆయనకు మరింత మంచి పేరు వస్తుందన్న ఆందోళనతో అసత్యాలు వల్లెవేశారు.
కృష్ణా వరదలకు ఉండవల్లి సీఎం నివాసంలోకి వరద వచ్చిందని.. అక్కడ ఉండలేకే బస్సులో బెజవాడ కలెక్టరేట్లో మకాం వేశారని ఆరోపించారు. బుడమేరుకు గేట్లు ఉండవని తెలియక ఆ గేట్లెత్తడం వల్లే విజయవాడ మునిగిందన్నారు. ఇక ఆయన మీడియా అమరావతిపై పెద్దఎత్తున విషప్రచారం సాగించింది. వర్షపునీటికి, వరదకు తేడా తెలియకుండా.. హైకోర్టుకు వెళ్లే రోడ్డు మునిగిందని.. సచివాలయం చుట్టూ వరద చేరిందని.. ఫేక్ ఫొటోలు, వీడియోలతో కథనాలు వండివార్చింది. నిజానికి వందేళ్లలో చవిచూడని వరద నిన్న కృష్ణా నదికి వచ్చింది. అయినా అమరావతి మునిగిపోలేదు.
భవిష్యతలోనూ చుక్కనీరు కూడా రాకుండా ఉండేందుకు చంద్రబాబు భారీ ప్రణాళికలు రూపొందించారు. రాజధానిలో మూడు భారీ కాలువల విస్తరణ, రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు, కృష్ణాకరకట్ట బలోపేతం వంటి చర్యలను తీసుకుంటున్నారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ ఆధునికీకరించేందుకు డిజైన్లు సిద్ధం చేశారు. సముద్ర తీరం కంటే దిగువన ఉండే నెదర్లాండ్ దేశానికి చెందిన సంస్థను కన్సల్టెన్సీగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంతో కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్‌ను ఆ దేశ కన్సల్టెన్సీతో డిజైన్ చేయిస్తున్నారు.
వచ్చే వర్షాకాలం నాటికి ఈ మూడు కాలువలు పూర్తి చేయాలని నిర్ణయించారు. కొండవీడు వాగు అనంతవరం నుంచి ఉండవల్లి వరకు వస్తుంది. పాలవాగు దొండపాడు నుంచి కృష్ణాయపాలెం మీదుగా కొండవీటివాగులో కలుస్తుంది. గ్రావిటీ కెనాల్ వైకుంఠపురం డౌన్లో వె ళ్తుంది. ఏ పరిస్థితుల్లోనూ రాజధానిలోకి చుక్క వరద నీరు చొరబడకుండా ఈ మూడు కాలువలను నవీకరించనున్నారు. కొండవీడు వాగు ప్రస్తుతం కొన్ని చోట్ల 10 అడుగులు, మరికొన్ని చోట్ల నాలుగు అడుగుల లోతు ఉంది, దీనిని 75 మీటర్ల లోతున, 115 మీటర్ల వెడల్పున ఆధునికీకరించనున్నారు.
ఈ మూడు కాలువల అభివృద్ధి వల్ల ఎంత నీరు వచ్చినా వీటిలోనే నిల్వ ఉంటుంది. ఎలాంటి పంపింగ్ కూడా అవసరం ఉండదు. ఆరు రిజర్వాయర్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ, శాఖమూరు దగ్గర 0.01 టీఎంసీ, సిటీ బయట 0.3 టీఎంసీ, 0.02 టీఎంసీ, వైకుంఠపురం వద్ద 0.03 టీఎంసీల సామర్ధ్యంతో కూడిన రిజర్వాయర్లను అభివృద్ధి చేస్తారు. అవసరం లేకపోయినా ముందస్తు చర్యగా కృష్ణానదిలోకి వెళ్లడానికి వీలుగా ఉండవల్లి, వైకుంఠపురం వద్ద పంపింగ్ స్టేషన్లు నిర్మించబోతున్నారు.
ఉండవల్లి వద్ద 12,350 క్యూసెక్కులు, వైకుంఠపురంలో 5,650 క్యూసెక్కుల సామర్థ్యంతో ఈ పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. అలాగే బకింగ్‌హామ్ కెనాల్ వద్ద మరో 4,000 క్యూసెక్కుల సామర్ధ్యంతో కూడిన పంపింగ్ స్టేషన్‌ను ప్లాన్ చేశారు. ఇక అమరావతికి వెళ్లే కృష్ణా కరకట్టను పటిష్ఠపరచి 4 వరుసల రహదారిని నిర్మించాలని ఆలోచిస్తున్నారు. భవిష్యతలో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కరకట్ట అత్యంత దుర్భేద్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రాజధానిలో ప్రస్తుతం చేపట్టిన కంప తొలగింపు దాదాపు పూర్తయింది. డిసెంబరు నెల నాటికి రాజధాని పనులు ఉధృతం కానున్నాయి.
అమరావతి రైతుల కౌలు విడుదల
ఇంకోవైపు.. రాజధాని రైతుల కౌలు కష్టాలు గట్టెక్కాయి. చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన 100 రోజుల్లోపే కౌలు విడుదల చేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ రాజధాని రైతులకు కౌలు చెల్లించకుండా ముప్పతిప్పలు పెట్టింది. గడచిన ఐదేళ్లలో కోర్టు మెట్లెక్కకుండా, ఉన్నత న్యాయస్థానాల తలుపులు తట్టకుండా రైతులకు కౌలు దక్కిన దాఖలాలే లేవు. చివరికి కోర్టు తీర్పులు, ఆదేశాలను కూడా జగన్ ఖాతరు చేయలేదు. ఆఖరి రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా కౌలు చెల్లించలేదు.
ఇప్పుడు ఆ భారం మొత్తం కూటమి ప్రభుత్వంపైనే పడింది. తనను నమ్మి వేలాది ఎకరాల భూములు త్యాగం చేసిన రైతుల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్న చంద్రబాబు.. వారి సమస్యలపై దృష్టి సారించారు. తొమ్మిదో ఏడాది కౌలు కింద రూ.190 కోట్లు విడుదల చేశారు. మెట్ట రైతులకు ఎకరానికి రూ.54 వేలు, జరీబు రైతులకు రూ.95 వేల చొప్పున వార్షిక కౌలు రైతులకు అందింది. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన మరో ఏడాది కౌలు విడుదల కావలసి ఉంది.
దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం వార్షిక కౌలు గడువును మరో ఐదేళ్లు పొడిగించి రైతులకు భరోసా కల్పించింది. అసైన్డ రైతులకు కౌలు చెల్లింపుల విషయంలో ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేపట్టిన సీఐడీ విచారణ వారి పాలిట శాపంగా మారింది. ఆ కేసుల నెపంతో వారిలో చాలా మందికి ఇప్పటికీ కౌలు దక్కలేదు. వారికి మూడేళ్లపాటు కౌలు రావలసి ఉంది.
అమరావతికి భూములివ్వడానికి సిద్ధం!
భూ సమీకరణ కింద భూములు ఇవ్వడానికి రాజధాని ప్రాంతంలో రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అమరావతిలో మరో 3 వేల ఎకరాలను భూ సమీకరణ కింద ఇవ్వడానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రైతులు ముందుకు రాలేదు. ఇప్పుడు ముందుకు రావడం ప్రభుత్వానికి ఆనందం ఇస్తోంది. పురపాలక మంత్రి పి.నారాయణ ఒకవైపు, సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ మరోవైపు రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ భూ సమీకరణకు ఒప్పిస్తున్నారు.
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు బఫర్ జోన్లో వాకింగ్ ట్రాక్
హైదరాబాద్ కేబీఆర్ పార్కు తరహాలో అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు బఫర్ జోన్లో అత్యంత పొడవైన వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లు పిలిచింది. అమరావతికి గుండెకాయ అయిన సీడ్ యాక్సెస్ రోడ్డుకు అదనపు హంగులు అద్దటంతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డులో సందర్శకుల సంఖ్యను పెంచేందుకు, వ్యాపారాలను పెంచటం కోసం కూడా మెగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు టెండర్లు పిలవటం గమనార్హం.
అమరావతిలో ఎన్-04 జంక్షన్ నుంచి ఎన్-11 జంక్షన్ వరకు మెగా వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.88.31 లక్షల వ్యయంతో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ద్వారా ఆ ప్రాంతం అంతా సందడిగా ఉంటుంది. అదే తరహాలో దానిని మించి సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి అభివృద్ధి చేయాలని ఏడీసీ అధికారులు భావిస్తున్నారు.
అమరావతికిచ్చే రూ.15,000 కోట్లు గ్రాంటే!
అమరావతి నిర్మాణం కోసం కేంద్రబడ్జెట్లో ప్రకటించిన రూ.15,000 కోట్లను గ్రాంటుగా భావించాల్సి ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ చెప్పారు. ఈ మొత్తాన్ని కేంద్రం ఈఏపీ అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుందని, తిరిగి ఆ అప్పును తానే పూర్తిగా 100 శాతం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంపై ఎలాంటి భారం పడబోదని చెప్పారు. సాధారణంగా ఈఏపీలో 90:10, 70:30, 85:15 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రం వాటాలుంటాయని, కానీ ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ మొత్తం భారాన్ని కేంద్రమే భరిస్తోందన్నారు. అలాగే, గత ఐదేళ్లలో నిర్వీర్యమైపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి గాడిలో పెడుతున్నట్టు ఆయన చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి తీసుకొచ్చి, వాటిని సద్వినియోగం చేస్తామని చెప్పారు.