తెలుగు సినిమాలో అతిపెద్ద కుటుంబం మెగా కుటుంబం
అల్లు రామలింగయ్యతో మొదలైన ఈ కుటుంబం చిరంజీవిని అల్లుడిగా చేసుకోవడం రెండు కొమ్మలుగా గొప్పగా విస్తరించింది.
అందరినీ కలిపి మెగా కుటుంబం అని పిలిచినా… అల్లు కుటుంబం తమ ఐడెంటిటీ కాపాడుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఇటీవల ఆ ప్రయత్నాలు ఎక్కువ అయ్యాయి.
ఇరువురు రెండు వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు.
అల్లు రామలింగయ్యకు ఉన్న తెలివితేటలు ఆయన కొడుకుతో పాటు మూడో తరమైన అల్లు అర్జున్, అల్లు శిరీష్ లకు రావడంతో ఆ కుటుంబం అఖండంగా ఎదుగుతోంది.
ఆహా ఓటీటీ నెలకొల్పి అల్లు అరవింద్ తన ఉనికిని మరింతగా చాటుకున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ తో బాగా పేరు సంపాదించారు. ఇపుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఓటీటీ సామ్రాజ్యాన్ని ఆహా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతోంది.
ఈ నేపథ్యంలో దానిని ఇపుడు దేశమంతటా విస్తరించడానికి పునాదులు వేశారు అల్లు అరవింద్.
మరోవైపు మెగా కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు తమ ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నారు. చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నాగబాబు గొప్పగా ఎదగకపోయినా ఆయన కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా రాణిస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తెలుగులో టాప్ స్టార్. ఆయన సంతానం ఇంకా ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు. వారింకా చిన్నవారు. ఇక చిరు మేనళ్లుళ్లు కూడా ఇండస్ట్రీని దున్నేస్తున్నారు.
సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇపుడు ట్రెండింగ్ లో ఉన్నారు.
వీరు రెండు కుటుంబాలుగా విస్తరిస్తున్న తీరు చూస్తుంటే తెలుగు సినిమా పరిశ్రమలో మెజారిటీ సినిమాలు వీరివే అని చెప్పాలి.
కొసమెరుపు ఏంటంటే… నందమూరి కుటుంబంతో మెగా కుటుంబానికి బంధం పెనవేసుకుంటోంది. అల్లు ఫ్యామిలీ బాలయ్యతో వెళ్తుంటే మెగా ఫ్యామిలీ నందమూరి రామారావుతో ముందుకు పోతోంది. ఇక ఈ రెండు కుటుంబాలు కలిస్తే ఇక తిరుగేముంది?