జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ తొలిసారి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని, కాబట్టి లీగల్ విషయాల గురించి తాను ఏమీ మాట్లాడబోనని మీడియాతో అన్నారు. అరెస్టయిన తర్వాత దేశవ్యాప్తంగా తనకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి, అన్ని ఇండస్ట్రీల నుంచి మద్దతు తెలిపిన సినీ ప్రముఖులకు, అభిమానులకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. తాను బాగానే ఉన్నానని, అభిమానులు ఆందోళన చెందవద్దని అన్నారు
తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, చట్టాన్ని గౌరవిస్తానని, పోలీసులు, అధికారులకు సహకరిస్తానని చెప్పారు. ఆ ఘటనలో రేవతి మృతి చెందడం చాలా బాధాకరం, దురదృష్టకరం అని, అనుకోకుండా అది జరిగిందని ఆవేదన చెందారు. రేవతి కుటుంబానికి మరోసారి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు అల్లు అర్జున్. రేవతి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకొని అండగా ఉంటానని హామీనిచ్చారు. 20 ఏళ్లుగా సంధ్యా ధియేటర్ కు వెళుతున్నా ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు.