టాలీవుడ్లో ఎంతో కలిసికట్టుగా ఉండే పెద్ద కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. అందులో ఉన్న హీరోలు, వాళ్ల కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు. పండుగలు, ప్రత్యేక సందర్భాలు వచ్చినపుడు కలిసి వేడుకలు చేసుకుంటారు. ఐతే ఈ మధ్య అల్లు అర్జున్‌కు, మెగా ఫ్యామిలీకి కొంత గ్యాప్ వచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవికి బన్నీ ప్రచారం చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే.
ఇది వ్యక్తిగత స్నేహంతో చేసిన సాయం అని బన్నీ వివరణ ఇచ్చుకున్నా అది మెగా అభిమానులకు రుచించలేదు. బన్నీ ప్రచారం చేసి వచ్చిన కొన్ని రోజులకే శిల్పా రవి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించడం చర్చనీయాంశం అయింది. కట్ చేస్తే ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో శిల్పా రవి చిత్తుగా ఓడాడు. వైసీపీ దారుణ పరాభవం చవిచూసింది. జనసేన అద్భుత ఫలితాలు సాధించింది.
దీంతో మరోసారి బన్నీని మెగా అభిమానులు సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. టీడీపీకి ప్రచారం చేసిన జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు బన్నీని తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీని కలిశాడు. పార్టీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టి, తాను కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన నేపథ్యంలో పవన్ చిరు ఇంటికి రాగా.. అక్కడ మెగా హీరోలు, వాళ్ల కుటుంబ సభ్యులందరూ కనిపించారు. అందరితోనూ పవన్ ఆత్మీయంగా కలిసి సంబరాలు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ వీడియోలో ఒకే లోటు ఏంటంటే.. అల్లు ఫ్యామిలీ లేకపోవడం. ముఖ్యంగా బన్నీ ఈ వేడుకలో పాల్గొనకపోవడం చర్చనీయాంశం అయింది. బన్నీ ఇందులో పాల్గొని ఉంటే మొన్న జరిగిన డ్యామేజ్ కొంత కంట్రోల్ అయ్యేది. ఐతే ఈ వేడుకలకు బన్నీని మిగతా మెగా ఫ్యామిలీ పిలవలేదా.. లేక అతనే ఖాళీ లేక రాలేదా అన్నది ఆ కుటుంబ వర్గాలకే తెలియాలి.