నోటికి వచ్చినట్లు మాట్లాడే అలవాటు ఈ మధ్యన సినీ ప్రముఖులకు ఎక్కువైందన్న మాట తరచూ వినిపిస్తుంటోంది. సంచలనమే ప్రధానం అన్నట్లుగా మాట్లాడే తీరుకు భిన్నం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. మొదట్నించి ఆయన ఏ రూల్ ను ఫాలో అవుతున్నారో.. ఇప్పుడు అదే తీరును ప్రదర్శిస్తున్నారు. నోటి నుంచి వచ్చే మాట విషయంలో ఆయన చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు. తొందరపాటుతో మాట్లాడటం అన్నది ఆయనలో కనిపించదు. ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 2018 మూవీని తెలుగులో అనువదించి.. విడుదల చేయటం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించి మీడియా సమావేశాన్ని తాజాగా నిర్వహించగా.. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తన వల్ల కెరీర్ లో ఎంతోమంది పైకి వచ్చారన్న అల్లు అరవింద్.. కెరీర్ పెరిగిన తర్వాత ఇచ్చిన మాటను మర్చిపోయి.. గీత దాటి వేరే సినిమాలు చేసినోళ్లు చాలామంది ఉన్నారన్నారు. తాను వారి పేర్లను ప్రస్తావించనని.. కానీ కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటి గురించి మాత్రం చెబుతానని చెప్పారు.
కార్తికేయ 2 విడుదలకు ముందే.. అతడిలో ఒక గొప్ప దర్శకుడు ఉన్నాడని తాను భావించానని.. అందుకే తమ బ్యానర్ లో రెండు సినిమాలు చేసేందుకు తాను ఓకే చెప్పానని చెప్పారు.
కార్తికేయ2 విడుదలయ్యాక.. బయట నుంచి చందూకు భారీ ఆఫర్స్ వచ్చాయని.. కానీ ఆయన మాత్రం ఇచ్చిన మాట కోసం నిలబడ్డారని.. తమ సినిమా పూర్తి అయ్యాకే వేరు ప్రాజెక్టులు టేకప్ చేస్తానని చెప్పినట్లు చెప్పారు. గతంలో పలువురు మాట తప్పి.. గీత దాటి వెళ్లారన్నారు. చందూతో తాము చేసే రెండు సినిమాల్లో ఒకదాని బడ్జెట్ రూ.200 కోట్లు ఉంటుందని అల్లు అరవింద్ వెల్లడించారు.
చందూతో రెండు మూవీలతో పాటు.. బోయపాటితో చేసే మూవీలో ఇద్దరు హీరోలు ఉంటారని.. దీనికి సంబంధించిన స్క్రిప్టు పని జరుగుతుందని చెప్పారు. సురేందర్ రెడ్డి కూడా ఒక సినిమా చేస్తారని.. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని.. అన్నీ పనులు పూర్తి అయ్యాక.. ఆ వివరాల్ని వెల్లడిస్తామని చెప్పారు.