మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి ముమ్మాటికీ తప్పే అని.. వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందంటూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వైసీపీకి మింగుడు పడడం లేదట. టీడీపీ ఆఫీసు దాడి కేసులో ఏ127గా ఉన్న ఆళ్ల శనివారం.. గుంటూరులో సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో పలు కీలక అంశాలపై అధికారులు దాదాపు 38 ప్రశ్నలు సంధించగా.. దాదాపు చాలా ప్రశ్నలకు ఆర్కే స్పష్టమైన సమాధానాలు ఇచ్చారట.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటన పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తప్పిదమేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి అంగీకరించారు. అయితే ఈ దాడికి సంబంధించిన కుట్రతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తనకు పైనుంచి ఎటువంటి ఆదేశాలు కానీ, ముందస్తు సమాచారం కానీ రాలేదని.. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగినట్టు ఓ విలేకరి కాల్ చేసి చెప్పాకే తనకు విషయం తెలిసిందని ఆళ్ల పేర్కొన్నారు.
ఆ సమయంలో తాను ఫిరంగిపురం మండలం పరిధిలోని వేమవరంలో ఉన్న తన పొలంలో ఉన్నానని.. కావాలంటే తన మొబైల్ పరిశీలించి లొకేషన్ చెక్ చేసుకోవచ్చని ఆర్కే తెలిపారు. నియోజకవర్గంలో తనకు తెలిసి జరిగేవి కొన్ని అయితే.. తెలియకుండా జరిగినవి చాలా ఉన్నాయని.. టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడిలో తన పాత్ర ఏమాత్రం లేదని సీఐడీ అధికారులకు ఆర్కే చెప్పారు. అదే సమయంలో ఈ దాడి పార్టీ పెద్దల కనుసన్నల్లోనే జరిగి ఉంటుందని.. కార్యకర్తలు అంత ధైర్యం చేయలేరని షాకింగ్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారట. కాగా, సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఆళ్ల కూడా పరోక్షంగా అదే చెప్పడంతో వైసీపీకి బిగ్ షాక్ తగిలినట్లైంది.