సాధారణంగా పదవీ విరమణ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవటానికి అధినేతలు ఎవరూ ఆసక్తి చూపించరు. దీనికి కారణం.. మరికొద్ది రోజుల్లో పదవి నంచి వైదొలుగుతున్న వేళ.. తీసుకునే నిర్ణయం సరిగా లేకపోతే జరిగే నష్టం.. ఎదురయ్యే విమర్శలతో తమ పాలనా కాలంలో తెచ్చుకున్న పేరుప్రఖ్యాతుల్ని చెడగొట్టుకోవటానికి ఇష్టపడరు. అదే కాదు.. సంప్రదాయం ప్రకారం.. పదవి నుంచి వైదొలిగే సమయం ఆసన్నమైన వేళ.. కీలక నిర్ణయాలకు.. విధానపరమైన నిర్ణయాలకు దూరంగా ఉంటారు.అయితే.. ఇలాంటి వాటిని పట్టించుకోవటం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అస్సలు ఇష్టం ఉండదన్నది తెలిసిందే. ఎవరేం అనుకున్నా.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేయటం.. తన ప్రత్యర్థుల్ని ఇరుకున పడేసే విషయంలో ఆయన ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో తెలిసిందే. దీనికి తగ్గట్లే తాజాగా చైనాకు చిర్రెత్తేలా ఒకనిర్ణయాన్ని తాజాగా ట్రంప్ తీసుకున్నారు.
మరికొద్ది రోజుల్లో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్న ఆయన.. చైనాకు చెందిన మరిన్ని యాప్ లపైన నిషేధాన్ని విధించారు. చైనా బిలియనీర్ జాక్ మా కు చెందిన యాంట్ గ్రూప్ అధ్వర్యంలో నడిచే అలీపే.. టెన్సెంట్ గ్రూప్ నకు చెందిన వీచాట్ పే లావాదేవీ యాప్ లతో సహా మొత్తం ఎనిమిది కార్యకలాపాల్ని నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఆదేశాల్ని జారీ చేశారు. తాజా నిర్ణయం 45 రోజుల్లో అమల్లోకి రానుంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే నాటికి ట్రంప్ అధ్యక్షుడిగా ఉండరు. ఆయన స్థానంలో బైడెన్ పదవీ బాధ్యతలు చేపడతారు. అలాంటప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకోకపోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ.. తనకు నచ్చని వారి విషయంలోట్రంప్ ఎంత కరకుగా ఉంటారన్నదానికి ఇదో నిదర్శనంగా చెప్పాలి. అయితే.. ఈ ఆదేశంపై చైనా కానీ.. బైడెన్ వర్గీయులు కానీ స్పందించలేదు. మొత్తంగా.. తన పదవీ కాలంలో పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ట్రంప్.. పదవిని విడిచి పెట్టే సమయం రోజుల్లోకి వచ్చిన తర్వాత కూడా తన తీరును మార్చుకోకపోవటం గమనార్హం.