టాలీవుడ్లో ఓ పెద్ద హీరో కొడుకు యుక్త వయసుకు రాగానే తన అరంగేట్రం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలైపోతాయి. ఎప్పటికప్పుడు ఊహాగానాలు నడుస్తుంటాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే.
‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో అతను ప్రత్యేక పాత్ర ద్వారా అరంగేట్రం చేస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తేలింది. ఆ సినిమా వచ్చిన చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతను హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ అరంగేట్రం విషయంలో కూడా ఇలాంటి ప్రచారాలే మొదలైపోయాయి. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో అతను స్పెసల్ రోల్ చేస్తున్నాడంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతోంది.
పవన్ కెరీర్లో అత్యధిక అంచనాలతో రాబోతున్న చిత్రాల్లో ‘ఓజీ’ ఒకటి. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో ప్రతిభ చాటుకున్న సుజీత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీని టీజర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపింది. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇంతలో అకీరా అరంగేట్రం గురించి ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున డిస్కషన్లు మొదలయ్యాయి.
అకీరా కోసం సుజీత్ ఒక క్రేజీ రోల్ రాశాడని.. పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేయడానికి ముందు అకీరాను ఈ చిత్రంతోనే పరిచయం చేస్తారని.. అకీరాతో పాటు సుజీత్‌కు కూడా సన్నిహితుడైన అడివి శేష్ ఈ పాత్రను డిజైన్ చేయడంలో సాయం చేస్తున్నాడని.. ఇలా రూమర్ రాయుళ్లు ప్రచారం పుట్టించేశారు. కానీ ‘ఓజీ’ టీం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అకీరా నటించడం లేదు. అతణ్ని ఇంకొన్నేళ్ల తర్వాత పూర్తి స్థాయి హీరోగానే పరిచయం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.