తమిళంలో ఈ సంక్రాంతికి అతి పెద్ద బాక్సాఫీస్ వార్ చూడబోతున్నాం. అక్కడ రజినీకాంత్ హవా తగ్గాక నంబర్ వన్ స్థానం కోసం పోటీలోకి వచ్చిన విజయ్, అజిత్.. ఒకేసారి ఈ సీజన్లో తమ సినిమాలను దించుతున్నారు. వీళ్లిద్దరూ టాప్ స్టార్లుగా ఎదిగాక ఇలా ఒకేసారి బాక్సాఫీస్ పోటీకి సై అనడం దాదాపుగా ఇదే తొలిసారి.
తమిళనాట ఉన్న థియేటర్లను ఈ రెండు చిత్రాలకు సమానంగా పంచేశారు. ఇద్దరిలో ఎవరిది పైచేయి అన్నది సంక్రాంతికి తేలిపోతుందనే చర్చ నడుస్తోందక్కడ. ఐతే రెండు సినిమాలకు భిన్నమైన టాక్ వస్తే.. ఎవరిది పైచేయో చెప్పడం కష్టమే. టాక్ కూడా సమానంగా ఉంటేనే ఎవరిది ఆధిపత్యమో తేలుతుంది.
ఇక టాక్‌తో సంబంధం లేకుండా తొలి వారం, వీకెండ్లో ఏ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందనే విషయంపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమిళనాడు అవతల అజిత్‌తో పోలిస్తే విజయ్‌కి మార్కెట్ ఎక్కువ. తమిళనాట మాత్రం విజయ్‌కి అజిత్ దీటుగా నిలుస్తాడు.
ఈ నేపథ్యంలో తమిళనాడులో తొలి రోజు, తొలి వీకెండ్లో ఏ సినిమాకు ఎంత వసూళ్లు వస్తాయనే విషయంపై అందరి దృష్టి నిలిచి ఉంది. కాగా మనకు రికార్డు రాకపోయినా అవతలి వాళ్లు రికార్డు కొట్టకూడదు అనే పంతం విజయ్, అజిత్ అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ చిత్రాల మేకర్స్‌లోనూ అదే అభిప్రాయం ఉన్నట్లుంది.
ముందు అనుకున్న ప్రకారమైతే జనవరి 11న తునివు, 12న వారిసు రావాల్సింది. కానీ అజిత్ సినిమాకు 11న సోలోగా బ్యాటింగ్ చేసే ఛాన్సిస్తే డే-1 రికార్డు సొంతమవుతుందేమో అన్న ఆలోచనతో ‘వారిసు’ రిలీజ్ డేట్ ప్రకటించకుండా ఉన్నారు. దీంతో అజిత్ సినిమాను కావాలనే 12న రిలీజ్ చేయడానికి ఒక దశలో చిత్ర బృందం రెడీ అయింది. కానీ తర్వాత ఆలోచన మార్చుకుని 11కే సినిమాను ఫిక్స్ చేశారు.
ముందు ‘తునివు’ టీం డేట్ అనౌన్స్ చేయగా.. కొన్ని గంటలకే ‘వారిసు’ డేట్ ప్రకటించారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు 12న కాకుండా ఈ చిత్రాన్ని కూడా 11కే ఫిక్స్ చేశారు. 11న అజిత్ ఎక్కడ రికార్డు కొట్టేస్తాడో అన్న టెన్షన్‌తోనే కావాలని ఈ చిత్రాన్ని కూడా అదే రోజుకు ఫిక్స్ చేశారన్నది స్పష్టం. కానీ రెండు చిత్రాలూ వేర్వేరు రోజుల్లో వస్తేనే అందరికీ మంచిదని.. దేనికవే ఎక్కువ వసూళ్లు తెచ్చుకునేవని.. ఇలా ఒకే రోజు రెండు సినిమాలు రావడం ఓపెనింగ్స్‌పై ప్రబావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.