ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తరువాత అక్కడంతా భయంభయం.
తాలిబాన్ ముష్కరుల బారిన పడకుండా దేశం విడిచి పారిపోయేందుకు ప్రజలు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
చివరకు విమానాల రెక్కలకు వేలాడి, టైర్లకు తమను తాము కట్టకుని వెళ్లేందుకు కూడా ఎందరో ప్రయత్నించారు.
అలాంటి ప్రయత్నాలలో ఎంతమంది సఫలమయ్యారో కానీ ప్రాణాలు పోగొట్టుకున్నవారు మాత్రం పదులసంఖ్యలో ఉన్నారు.
కాబూల్ ఎయిర్‌పోర్టులోకి ప్రజలెవరూ రాకుండా తాలిబాన్ సాయుధులు కాపలా కాస్తుండడంతో గోడలు, గోడలపై ఉన్న ముళ్ల కంచెలను పిల్లాపాపలతో దాటుతూ ఎయిర్‌పోర్టులోకి ఎలాగో ఒకలా చేరుకుంటున్నారు.
ఇలాంటి కష్టాలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో లెక్కలేనన్ని షేర్ అవుతున్నాయి.
అయితే, ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కష్టాలకు సంబంధించిన అన్ని వీడియోలు ఒక ఎత్తయితే ఈ వీడియో ఇంకో ఎత్తు.
కాబూల్ ఎయిర్పోర్ట్ రన్‌వేపై ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయిలు తమ కష్టాలను వివరిస్తూ పాట పాడారు.
అంతకష్టంలోనూ వారు వేదన నిండిన మృదువైన స్వరంతో పాడిన పాట వింటుంటే గుండెలవిసిపోతాయి.
‘‘మేం ఇల్లు లేని వాళ్లం.. మాకంటూ ఏమీ లేదు’’ అంటూ ఆఫ్ఘాన్ భాషలో వారు పాడే పాట అంతటికీ మనకు అర్థం తెలియకపోయినా వారి బాధను మాత్రం అర్థం చేసుకోగలమేమో.
ఆ వేదనాభరితన గానం మీరూ వినండి.