వైసీపీ హయాంలో ఆ పార్టీ అండ చూసుకొని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై, వారి కుటుంబ సభ్యులపై వైసీపీ సానుభూతిపరులు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు బూతులతో, అసభ్య పదజాలంతో, అశ్లీల కరమైన పోస్టులతో పైశాచికానందం పొందిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే నటి శ్రీరెడ్డి పై కూడా రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
దీంతో, త్వరలోనే శ్రీరెడ్డిని అరెస్ట్ చేసి విచారణకు పిలిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి నారా లోకేష్ కు క్షమాపణలు చెబుతూ శ్రీరెడ్డి బహిరంగ లేఖ రాసింది. తనను క్షమించాలని లొకేష్ ను కోరిన శ్రీరెడ్డి భవిష్యత్తులో ఎటువంటి రాజకీయపరమైన కామెంట్లు చేయనని, గతంలో వాడిన భాష వాడబోనని చెప్పింది. 10 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూసి తాను ఎంత మందిని బాధపెట్టానో అర్థమవుతుందని శ్రీ రెడ్డి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది.
తన సినీ, రాజకీయ జీవితం ముగిసిపోయిందని, కానీ తన ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలున్నారని, వారిని దృష్టిలో పెట్టుకొని తనను వదిలేయాలని శ్రీరెడ్డి వేడుకుంది. ఇక, వైసీపీ సభ్యురాలిని కాకపోయినా సానుభూతిపరురాలిగా టిడిపి, జనసేన నేతలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడానని, ఆ వ్యాఖ్యలు వైసీపీకి నష్టం కలిగించాయని ఆలస్యంగా తెలుసుకున్నానని చెప్పింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ కు కూడా శ్రీ రెడ్డి క్షమాపణలు చెప్పింది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఏ శిక్ష విధించిన సిద్ధమని శ్రీరెడ్డి చెప్పింది.
అయితే కన్ను మిన్ను కానరాకుండా గతంలో వ్యాఖ్యలు చేయడం దేనికి ఇప్పుడు ఇలా పశ్చాత్తాప పడటం దేనికి అని శ్రీరెడ్డి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. శ్రీ రెడ్డికి మాత్రమే కుటుంబం లేదని శ్రీరెడ్డి ఇంట్లో మాత్రమే పెళ్ళికి ఎదిగిన ఆడపిల్లలు లేరని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు చూసిన ఇకపై అటువంటి పోస్టులు పెట్టకుండా మిగతా వైసీపీ సానుభూతిపరులకు బుద్ది వస్తుందని అంటున్నారు.