గత ప్రభుత్వం అండ చూసుకొని రెచ్చిపోయిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇపుడు చట్ట ప్రకారం శిక్షకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఆడవాళ్లు..చిన్న పిల్లలు అని చూడకుండా నోటికి ఎంతొస్తే అంత పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందిన బోరుగడ్డ, శ్రీరెడ్డి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
మహిళలపై అసభ్యకరమైన పోస్టులు, అశ్లీలకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నా ఫలితం లేదు. ఈ క్రమంలోనే వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలులో అనిల్ పై మరో కేసు నమోదైంది. చంద్రబాబును చంపేస్తానని గతంలో అనిల్ బెదిరించిన వైనంపై కర్నూలులో కేసు నమోదైంది. దీంతో, ఆయనను పీటీ వారెంట్ కింద రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కర్నూలుకు తరలించారు. తన తప్పు తెలుసుకొని బోరుగడ్డ అనిల్..పోలీసుల ముందు బోరుమని ఏడ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు, సినీ నటి, సోషల్ మీడియా కార్యకర్త శ్రీరెడ్డి కూడా తాజాగా యూ టర్న్ తీసుకున్నారు. గతంలో నోటికి వచ్చినట్లు పేట్రేగిపోయిన శ్రీరెడ్డి…తాజాగా తొలిసారి తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు తనను క్షమించాలని కోరారు.
వారిపై తాను సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టానని, ఇక నుంచి అలా చేయనని అన్నారు. తనలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా క్షమించాలని కోరారు. తన కుటుంబం, భవిష్యత్తు దృష్ట్యా తలవంచి వేడుకుంటున్నానని అన్నారు. రాజకీయ యుద్ధం లీడర్ల మధ్య మాత్రమే ఉండాలని, కార్యకర్తలను వదలిపెట్టాలని శ్రీరెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే, వైసీపీ అధికారంలో ఉన్నపుడు కన్నూమిన్నూ కానరాకుండా కారు కూతలు కూసిన శ్రీరెడ్డి…ఇప్పుడు అరెస్టు భయంతో ఇలా క్షమించాలని వేడుకుంటే పోలీసులు వదిలేస్తారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.