ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె ప్రొడక్షన్ లో వచ్చిన తొలి చిత్రం `శుభం`. మే 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే శుభం ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న సమంత.. తాజాగా సెలబ్రిటీగా ఉండడం అనేది ఒక్కోసారి ఎంత నరకంగా ఉంటుందో వివరించింది. అందులో భాగంగానే తన లైఫ్ లో ఒక బాధాకరమైన సంఘటనను బయటపెట్టింది.
సమంత మాట్లాడుతూ.. ` డిసెంబర్ లో నాన్న మరణించినట్లు అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. కొంతకాలంగా నాన్నతో మాట్లాడక పోవడం వల్ల నేను విషయం తెలియగానే షాక్ అయ్యాను. వెంటనే ముంబై నుంచి చెన్నైకి విమానంలో బయలుదేరాను. ఆ టైమ్‌లో కొందరు అభిమానులు ఫోటో అడిగిన విషయం ఎప్పటికీ మర్చిపోలేను. నాన్న చనిపోయారన్న బాధ గుండెల్ని పిండేస్తున్న నేను వారితో నవ్వుతూనే ఫోటోలు దిగాను` అని తెలిపింది.
`అభిమానులు తన దగ్గరకు వచ్చి ఫోటోలు అడిగితే నేనెప్పుడు నో చెప్పను. ఎందుకంటే, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అభిమానులే కారణం. పైగా సెలబ్రిటీలుగా మనం ఎలాంటి బాధలు అనుభవిస్తున్నామో వారికి తెలియకపోవచ్చు. అందుకే తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలోనూ నేను ఫోటోలకు నో చెప్పలేదు. కానీ సెలబ్రిటీగా ఉండడం అనేది ఎంత నరకమో ఆ రోజు నాకు అర్థమైంది. తండ్రి చనిపోయినప్పుడు ఏ వ్యక్తి నవ్వాలని అనుకోడు` అంటూ సమంత చెప్పుకొచ్చింది. కాగా, సమంత అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ `మా ఇంటి బంగారం` అనే సినిమాలో యాక్ట్ చేస్తుంది. అలాగే మరోవైపు రాజ్ & డీకే దర్శకత్వంలో `రక్త బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్డమ్` అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్స్ చిత్రీకరణ దశలోనే ఉన్నాయి.