టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బ్రహ్మానందానికి జోడీగా హేమ నటించిన చిత్రాలు, ఆ కామెడీ సీన్లు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. సినిమాలతో పాటు టాలీవుడ్ లోని సమస్యలపై కూడా హేమ యాక్టివ్ గా స్పందిస్తుంటారు. ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న హేమ… ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న హేమ…ఓ రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన హాట్ టాపిక్ గా మారింది.
శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన హేమ…ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీరు ఎంతమంది వచ్చారు? అందరూ టికెట్ తీసుకున్నారా? అంటూ ఓ విలేకరి…హేమను ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే ఆ విలేకరిపై హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 వేల రూపాయల విలువైన చీరను అమ్మవారికి సమర్పించానని, హుండీలో 10 వేలు వేశానని చెప్పారు. టికెట్ తీసుకుని వచ్చానని, ప్రోటోకాల్ ప్రకారమే దర్శనం జరిగిందని అన్నారు.
దీనిని కూడా వివాదం చేస్తారా అంటూ రిపోర్టర్ పై హేమ ఫైర్ అయ్యారు. తాను అమ్మవారి ఆశీస్సుల కోసం మాత్రమే వచ్చానని, వివాదం సృష్టించేందుకు రాలేదని హేమ మండిపడ్డారు. తాను దుర్గమ్మ భక్తురాలినని, ఈ ఏడాది అమ్మవారి దర్శనం లభిస్తుందో లేదో అని కంగారు పడ్డానని హేమ అన్నారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని విన్నానని, కానీ చివరకు అన్నీ కుదిరి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించానని చెప్పారు. చివరి నిమిషంలో దుర్గమ్మ తల్లి కరుణించిందని, అందుకే స్వయంగా వచ్చి దర్శించుకోగలిగానని అన్నారు.