2002లో విడుదలైన `మన్మధుడు` మూవీతో తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అందాల తార అన్షు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తొలి సినిమాతోనే భారీ స్టార్డమ్ సంపాదించుకున్న అన్షు.. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో కనిపించి తెరపై కనుమరుగైపోయింది. మళ్లీ చాలా కాలం తర్వాత `మజాకా` అనే మూవీతో అన్షు రీ ఎంట్రీ ఇస్తోంది. త్రినాథ రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, రీతువర్మ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు రావు రమేష్, అన్షు ముఖ్యమైన పాత్రలను పోషించగా.. రాజేష్ దండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 26న మజాకా మూవీ విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్షు ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. రెండు మూడు సినిమాలు తర్వాత నటనకు దూరం కావడానికి గల కారణాలేంటో అన్షు ఇంటర్వ్యూలో వెల్లడించింది. `నేను 15 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చి మన్మధుడు మూవీ చేశాను. ఆ ఏజ్ లో నాకంత ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు. మరోవైపు చదువుకోవాల్సి వచ్చింది. అందుకే యాక్టింగ్ మానేసి లండన్ వెళ్లిపోయాను. మాస్టర్స్ కంప్లీట్ చేసి సైకాలజిస్ట్ అయ్యాను. సొంతంగా ఓ క్లినిక్ కూడా పెట్టుకున్నాను. 24 ఏళ్లకి సచిన్ సాగర్ ను వివాహం చేసుకున్నాను. మాకు ఇద్దరు సంతానం. ఒకవేళ మన్మధుడు సమయానికి నా వయసు 25 ఏళ్ళు ఉండుంటే నేను నటిగానే కొనసాగేదాన్నేమో` అని అన్షు చెప్పుకొచ్చింది.
మజాకాలో ఆఫర్ గురించి మాట్లాడుతూ.. `మన్మధుడు సినిమా రీ-రిలీజ్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ వారు నా వీడియో బైట్ కోసం కాంటాక్ట్ అయ్యారు. అలా సోషల్ మీడియాలో మళ్లీ కనిపించాను. ఆ వెంటనే రైటర్ ప్రసన్న కుమార్ గారు నన్ను కలిసి స్టోరీ చెప్పారు. అలా మజాకాలో ఛాన్స్ వచ్చింది. నా భర్త సపోర్ట్ చేయడంతో మళ్లీ యాక్టింగ్ స్టార్ట్ చేశాను` అని అన్షు వివరించింది.
ఇకపోతే అన్షు పూర్తి పేరు అన్షు అంబానీ అని వికీపీడియాలో ఉంటుంది. ఈ విషయంపై కూడా అన్షు స్పందించింది. `అంబానీ అనేది పాపులర్ సర్ నేమ్. కానీ అది నా ఇంటి పేరు కాదు. అసలు అంబానీ పేరు నాకు ఎలా వచ్చిందో కూడా తెలియదు. వికీపీడియాలో కూడా అదే ఉంటుంది. అక్కడ ఎలా చేంజ్ చేయాలో తెలియలేదు. నాకో ఇంటిపేరు ఉంది. కానీ ఆ పేరుని ఎక్కడా నేను వాడలేదు` అని అన్షు తెలిపింది.