ప్రస్తుతం బాలీవుడ్లో మంచి ఫాంలో ఉన్న యువ నటుల్లో విక్రాంత్ మాస్సే ఒకడు. సూపర్ స్టార్లు సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతుంటే.. విక్రాంత్ తన స్థాయిలో చిన్న, మీడియం బడ్జెట్లలో సినిమాలు చేస్తూ నిలకడగా హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు. హసీన్ దిల్రుబా, రామ్ ప్రసాద్ కి తెహ్వి, ట్వెల్త్ ఫెయిల్, సెక్టార్ 36, సబర్మతి రిపోర్ట్ లాంటి సినిమాలు.. మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్ లాంటి వెబ్ సిరీస్లు అతడికి మంచి పేరు తెచ్చాయి. ట్వెల్త్ ఫెయిల్ అయితే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈ మధ్య కాలంలో ఇండియాలో వచ్చిన బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. లేటెస్ట్గా విక్రాంత్ నుంచి వచ్చిన ‘సబర్మతి రిపోర్ట్’ సైతం మంచి విజయాన్నందుకుంది. కెరీర్ ఇంత ఊపులో సాగుతుండగా.. విక్రాంత్ తాజాగా తీసుకున్న నిర్ణయం అందరికీ షాక్కు గురి చేస్తోంది. కుటుంబ కారణాలతో అతను సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
‘‘కొన్నేళ్ల నుంచి మీ నుంచి అసాధారణమైన ప్రేమను, అభిమానాన్ని పొందుతున్నాను. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. కుటుంబ సభ్యులకు నా పూర్తి సమయాన్ని కేటాయించాలని టైం వచ్చింది. అందుకే కొత్త సినిమాలను అంగీకరించట్లేదు. మళ్లీ సరైన సమయం వచ్చే వరకు 2025లో విడుదలయ్యేదే నా చివరి సినిమా. ఇటీవల నా నుంచి వచ్చిన సినిమాలను మీరు ఆదరించిన తీరును మరిచిపోలేను. నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలను ఇచ్చారు. అందరికీ కృతజ్ఞతలు’’ అని ఓ ప్రకటనలో విక్రాంత్ మాసే తెలిపాడు.
ఫెయిల్యూర్లలో ఉన్న వాళ్లు, వయసు మీద పడ్డ వాళ్లు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడం మామూలే కానీ.. ఇలా మంచి ఫాంలో ఉండగా బ్రేక్ తీసుకోవడం అరుదు. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడం అంటే తన ఫ్యామిలీలో ఎవరికైనా తీవ్ర అనారోగ్య సమస్యలేమైనా తలెత్తాయా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కారణం ఏదైనప్పటికీ విక్రాంత్ లాంటి మంచి నటుడు ఇలా సినిమాలకు దూరం కావడం ప్రేక్షకులకు రుచించని విషయమే.