ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో పవన్ ను రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కు శాలువా కప్పి సత్కరించారు రాజేంద్రప్రసాద్. ఆ తర్వాత ఈ ఇద్దరు నటులు కాసేపు సమకాలీన రాజకీయాలు, సినిమాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
ఇటీవల వాడెవడో ఎర్ర చందనం దొంగ హీరో అట అంటూ పుష్ప-2 గురించి రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. తాను తన సినిమాలతో పాటు ఆ సినిమా గురించి కూడా మాట్లాడానని అన్నారు. ఇక, లక్ష్మీ పార్వతిపై కూడా రాజేంద్ర ప్రసాద్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాటి పరిస్థితులను, టీడీపీని చంద్రబాబు కాపాడిన వైనం గురించి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ పవన్ కల్యాణ్ ను కలవడం వెనుక రాజకీయ ప్రాధాన్యత ఏమన్నా ఉందా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒకవేళ రాజేంద్ర ప్రసాద్ రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారా…? జనసేనలో ఆయన చేరబోతున్నారా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.