తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుంచీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్ రోజుకు రోజుకు ముదురుతోంది. జస్ట్ అస్కింగ్ క్యాప్షన్ తో పవన్ ను టార్గెట్ చేసి పదే పదే విమర్శలతో ప్రకాష్ రాజ్ విరుచుకుపడుతున్నారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటైర్లు పేల్చారు.
ఇటీవల తిరుపతి వారాహి బహిరంగ సభలో తమిళనాడు రాష్ట్ర ఉపముఖమంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే. గతంలో సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించడాన్ని పవన్ తప్పుబట్టారు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని.. దాన్ని నిర్మూలించాలనుకుంటే వారే తుడిచిపెట్టుకుని పోతారంటూ ఉదయనిధికి పవన్ కళ్యాణ్ తమిళంలోనే కౌంటర్ ఇచ్చారు.
అయితే ఈ నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కి మద్దతు పలికారు. శనివారం చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ లతో పాటు ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్టాలిన్ ను ఉద్ధేశిస్తూ చేసిన కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు.
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే.. మరొక డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని ప్రకాష్ రాజ్ పరోక్షంగా విమర్శించారు. తాను ఎన్నటికీ బలహీన వర్గాల తరఫునే మాట్లాడతానని, ప్రశ్నిస్తానని అన్నారు. తమది సమానత్వమని, తాను ప్రశ్నిస్తే భయపడుతున్నారని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. చెన్నైలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.