టాలీవుడ్ రారాజు, సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న రెబల్ స్టార్ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు అంత్యక్రియలు నేడు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. మొయినాబాద్ లోని కనకమామిడి ఫాంహౌస్ లో అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజుకు ఆయన కుటుంబ సభ్యులు తుది వీడ్కోలు పలికారు.
తెలంగాన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి కృష్ణం రాజు పార్ధివ దేహానికి గన్ సెల్యూట్ చేశారు. హీరో ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ తన పెదనాన్న కృష్ణంరాజుకు తలకొరివి పెట్టారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఫాం హౌస్ దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కృష్ణం రాజు కుటుంబ సభ్యులను, ప్రముఖులను, బంధుమిత్రులను, అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫాంహౌస్ లోకి పంపించారు.
కృష్ణం రాజు అంత్యక్రియలు జరిగిన కనకమామిడి ఫాంహౌస్ కు ఓ ప్రత్యేకత ఉంది. కృష్ణంరాజుకు ఆ ఫాం హౌస్ అంటే చాలా ఇష్టం. ఆ ఫాంహౌస్ లోనే వ్యవసాయం చేస్తూ తన శేష జీవితం గడపాలని కృష్ణం రాజు భావించారు. అంతేకాదు, ఆ ఫాం హౌస్ లో ఇంటి నిర్మాణం చేపట్టాలని కూడా మొదలుబెట్టారు. కానీ, ఇంతలోనే కృష్ణంరాజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బాగా నచ్చిన కనకమామిడి ఫాంహౌస్ లోనే కృష్ణం రాజు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
అంతకుముందు, కృష్ణంరాజు అంతిమయాత్ర ఆయన స్వగృహం నుంచి ప్రారంభమైంది. బీఎన్ఆర్ కాలనీ బ్రిడ్జ్, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, అప్పా జంక్షన్ మీదుగా మొయినాబాద్‌కు అంతిమయాత్రను కొనసాగించారు. కాగా, కృష్ణంరాజు ఇక లేరు అన్న వార్తను ఆయన సతీమణి శ్యామలా దేవి జీర్ణించుకోలేకపోయారు. అంతిమ యాత్ర మొదలుకావడానికి ముందు కృష్ణం రాజు పార్ధివ దేహంపై పడి అరగంటపాటు ఆమె విలపించారు. మామూలుగా అయితే, హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీలు పాడె మోయరు. కానీ, తన రాజు వెళ్లిపోతున్నారన్న దు:ఖంతో శ్యామలాదేవి…కన్నీటి పర్యంతమవుతూ కృష్ణం రాజు పాడె మోశారు. ఈ దృశ్యం కుటుంబసభ్యులను, అభిమానులను కంటతడి పెట్టించింది.