అవసరం లేని వేళ అనవసరమైన ఎటకారాలు ఆడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పుడు అలాంటి కామెడీకి తెర తీసిన సీనియర్ నటుడు బ్రహ్మాజీ.. పండుగపూట యాంకర్ కమ్ నటి అనసూయకు ఫెస్టివల్ హ్యాపీనెస్ లేకుండా చేశారని చెప్పాలి. కొద్ది రోజులుగా ఆన్ లైన్ అబ్యూస్ పేరుతో ఆమె చేస్తున్న పోరాటంపై అనుకూలంగా మాట్లాడేవారి కంటే ఎటకారంగా మాట్లాడేవారే ఎక్కువగా కనిపిస్తుంటారు. నిజానికి ఆమె చేపట్టిన ‘‘సే నో టూ ఆన్ లైన్ అబ్యూస్’’ అనే గంభీరమైన అంశాన్ని చాలామంది కామెడీగానే తీసుకుంటున్నారు. దీనికి కారణం.. ఆమె చెప్పిన మాటను తప్పుగా అన్వయించుకోవటమే.
అనసూయ.. తనను ఆంటీ అని పిలవటాన్ని తప్పు పట్టి.. కేసులు పెడతానని బెదిరిస్తున్నారన్న తప్పుడు సంకేతాలు వెళ్లటమే దీని కారణం. అనసూయ ట్విటర్ హ్యాండిల్ ను చూసినప్పుడు.. ఆంటీ అన్న పదానికి అభ్యంతరమే తప్పించి.. దాని మీదనే కేసులు కాదన్నది కనిపిస్తుంది. కాకుంటే.. జనబాహుళ్యం దేని మీదనైతే ఫోకస్ చేస్తుందో.. దానినే హైలెట్ చేసే అలవాటు ఉండటంతో.. ఆన్ లైన్ వేదికగా చేసుకొని నోటికి వచ్చినట్లుగా తిట్టిపోసి.. కామెంట్లు చేసే వారు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని.. మర్యాద వ్యాఖ్యలు చేయాలని.. సహేతుక కారణాలు చూపిస్తూ విమర్శలు చేయాలన్నదే తప్పించి.. తనను ఆంటీ అనటాన్ని ఆమె తప్పు పట్టటం లేదు.
మీసాలు.. గడ్డాలు పెరిగిపోయినోళ్లు (కరోనా వేళలో యూత్ కూడా అలాంటి ముఖాలతోనే కనిపిస్తున్నారు. కానీ వారిని ఉద్దేశించి ఆమె అనలేదు) కూడా తనను ఆంటీ అని పిలవటం ఏమిటని మరో యాంకర్ సుమతో మాట్లాడటం.. దానికి ఆమె ఇచ్చిన సమాధానాన్ని చాలామంది తమ పంచ్ లకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఇదంతా అందరికి తెలిసిందే అయినా.. ఈ వ్యవహారంలోకి తాజాగా ఎంట్రీ ఇచ్చారు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. తాజాగా (మంగళవారం సాయంత్రం) తన సెల్పీని పోస్టు చేస్తూ.. ఏం జరుగుతోంది? అని ఫ్యాన్స్ ను అడిగాడు.
దానికి బదులుగా ఒక నెటిజన్ ‘ఏం లేదు అంకుల్’ అంటూ బదులిచ్చారు. దీనికి స్పందించిన బ్రహ్మాజీ రీట్వీట్ చేస్తూ.. ‘అంకుల్ ఏంటి? అంకుల్. కేసు వేస్తా. బాడీ షేమింగ్ చేస్తున్నావా?’ అంటూ నవ్వుల ఎమోజీని తన ఎటకారపు వ్యాఖ్యకు జత చేశారు. మరో సందర్భంలో ‘అంకుల్ ఏంట్రా అంకుల్.. కాల్ మీ బ్రో’ అంటూ తనదైన రీతిలో వ్యాఖ్య చేశారు. మొత్తంగా ఇన్ డైరెక్టుగా అనసూయను కెలికేలా ఆయన పోస్టు ఉందని చెప్పకతప్పదు. బ్రహ్మాజీ నుంచి అలాంటి పంచ్ వచ్చినంతనే.. వేలాదిగా లైక్స్.. రీట్వీట్స్.. వందల సంఖ్యలో కామెంట్లు వెల్లువెత్తాయ. పలువురు ఫన్నీ మీమ్స్ పెట్టేశారు.
‘అన్నా.. మళ్లీ రెచ్చగొట్టారు ఆంటీని’.. ‘మీరెన్ని కేసులు వేస్తానని చప్పినా.. ఫలానా ఆంటీగారికి వచ్చినంత అటెన్షన్ మాత్రం మీకు రాదు బ్రహ్మాజీగారు’.. ‘హే.. మీరూ వేసేశారు’’.. ‘‘అంకులా.. మజాకా’.. ‘మాస్ ట్రోలర్’.. ‘వాటే టైమింగ్’.. ‘ఓకే అంకుల్’ అంటూ ఎవరికి వారు తమ వ్యంగ్య వ్యాఖ్యలకు పదును పెట్టేశారు. మొత్తానికి సద్దుమణుగుతోందని భావిస్తున్న‘ఆంటీ’ ఎపిసోడ్ ను మరింత విస్తరించేలా ‘అంకుల్’ కామెంట్ ఉందన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. నిత్యం ఏదో ఒక హాట్ సబ్జెక్టును ఎంచుకునే నెటిజన్లకు అనసూయ ఎపిసోడ్ మాత్రం తెలుగు టీవీ సీరియల్ మాదిరి కొనసాగుతోందని చెప్పక తప్పదు.
Comments 1