ఆది పినిశెట్టి.. తమిళ, తెలుగు ప్రేక్షకులకు అత్యంత సుప్రసిద్ధుడు. దర్శకుడు రచయితైన రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది పినిశెట్టి.. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా విలన్‌గా, సహాయక నటుడిగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. తెలుగు, తమిళ ఇండస్ట్రీస్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. త్వరలోనే `శబ్దం` అనే సినిమాతో ఆది ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఫిబ్రవరి 28న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది పినిశెట్టి.. నెట్టింట వైరల్ అయ్యే విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.
2022లో తన చిరకాల స్నేహితురాలు మరియు నటి నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి ఏడడుగులు వేశాడు. రీల్ లైఫ్ లో జంటగా నటించిన ఆది, నిక్కీ.. రియల్ లైఫ్‌లో కూడా జంటగా మారారు. అయితే పెళ్లైన రెండేళ్లకే ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ విడాకులు తీసుకుంటున్నారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై తాజాగా ఆది పినిశెట్టి అసహనం వ్యక్తం చేశాడు. విడాకుల వార్తలను కొట్టిపారేశాడు.
`నిక్కీ నాకు మంచి స్నేహితురాలు కావడంతో పెళ్లి విషయంలో ఇంట్లో వాళ్లను ఒప్పించడం సులభం అయింది. 2022లో మేము వివాహం చేసుకున్నాం. మా ఇంట్లో వాళ్లకు ఆమె బాగా దగ్గరైపోయింది. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. అలాంటి మేము విడాకులు తీసుకుంటున్నట్టు ఆ మధ్య కొన్ని యూట్యూబ్ లో కథనాలు వచ్చాయి. చాలా కోపం వచ్చింది. అసలు అలాంటి వారిని ఏమనాలో కూడా అర్థం కాలేదు. కేవలం వ్యూస్ కోసమే ఇటువంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారు. వాళ్లను పట్టించుకోకపోవడమే మంచిదనిపించింది. కానీ తమ బాగు కోసం ఇతరుల జీవితాలను రోడ్డుకు లాగడం ఎంత వరకు కరెక్ట్ అన్నది వాళ్లే ఆలోచించుకోవాలి` అంటూ ఆది పినిశెట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు.