ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకోబోతున్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబుపై సోము చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. గతంలో ఏపీలోకి సిబిఐని చంద్రబాబు అనుమతించలేదని, అమిత్ షాపై తిరుపతిలో దాడి జరిగితే చంద్రబాబు చర్యలు తీసుకోలేదని సోము విమర్శలు గుప్పించడం సంచలనం రేపింది.
ఆ విషయాలపై మాట్లాడే దమ్ముందా అంటూ చంద్రబాబుకు సోము సవాల్ విసరడం ఏపీ రాజకీయాల్లో కాక రేపింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వద్దన్నారని, చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయనను మీడియా ప్రతినిధులు ఎందుకు ప్రశ్నించలేదని సోము నిలదీశారు. ఈ నేపథ్యంలోనే సోము వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మార్చిన జగన్ పై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరితే సోముకు ఎందుకు అంత కోపం వచ్చిందని అచ్చెన్న ప్రశ్నించారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పినప్పుడు ఆర్టికల్ 355 ప్రకారం కేంద్రం కల్పించుకునే అధికారం ఉందన్న విషయాన్ని సోము తెలుసుకోవాలని హితవు పలికారు. ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం, నేరాలపై అమిత్ షా తో పాటు నడ్డా కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి వాస్తవం కాదా అని అచ్చెన్న ప్రశ్నించారు. వివేకా కేసులో సీబీఐపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడిని సోము చూడలేదా అని ప్రశ్నించారు. ఏపీలో దళితులు, బడుగు వర్గాలపై జరుగుతున్న హింస కనబడడం లేదా అని నిలదీశారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంసంపై, పాలనపై పోరాడాల్సిన సోము వీర్రాజు ఆ పార్టీని వెనకేసుకు రావడానికి ప్రయత్నించడం దారుణం అన్నారు. జగన్ ను ప్రశ్నిస్తే సోముకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలపై, చంద్రబాబుపై విమర్శలు మాని ప్రభుత్వ లోపాలను ప్రశ్నించడంపై ఫోకస్ చేయాలని అన్నారు.