ఏపీలో పీఆర్సీ రగడ తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టివేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టడం చర్చనీయాంశమైంది. ఇక, ఈ జీవోలను రద్దు చేయాలని, అవి విభజన చట్టంలోని హామీలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే, ఈ రోజు కలెక్టరేట్ల దగ్గర నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులను, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయడం, హౌస్ అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. హక్కుల కోసం ఉద్యమించిన ఉద్యోగులను అరెస్టు చేయిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో 43% పిఆర్సీ ఇవ్వడాన్ని తప్పుబట్టిన జగన్ రెడ్డి….ఈరోజు అసలు వేతనాలకే ఎసరు పెట్టారని ఎద్దేవా చేశారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సింన సీఎం….అరెస్టులు చేయించడం సిగ్గుచేటని అచ్చెన్న దుయ్యబట్టారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని కాగ్ నివేదికలు కూడా చెబుతున్నాయని, ఆదాయం లేదంటూ ఉద్యోగుల పొట్ట కొట్టడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు ఇచ్చిన హమీల్లో గడిచిన రెండున్నరేళ్లలో ఒక్కటీ అమలు చేయకుండా ఉద్యోగులకు మొండిచేయి చూపారని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామన్న జగన్…వారి ఆశలకు సమాధి కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల న్యాయ పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని, పీఆర్సీ విషయంలో జగన్ పునారాలోచించుకోవాలని అచ్చెన్న హితవు పలికారు.