మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజిని చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. విజిలెన్స్ తనిఖీల ముసుగులో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ. 2.20 కోట్లు అక్రమంగా వసూల్ చేశారని విడుదల రజిని అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో తాజాగా ఆమెపై ఏసీబీ కేసు నమోదు చేసింది. నాడు విడదల రజిని అక్రమాలకు కొమ్ము కాసిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, అప్పటి గుంటూరు ఆర్వీఈవోతో సహా మరికొందరిపై కేసు నమోదైంది.
మాఫియా తరహాలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి, డబ్బులు గుంజిన కేసులో విడదల రజిని ఏ1గా, పల్లె జాషువా ఏ2గా, రజిని మరిది గోపి ఏ3గా, ఆమె పీఏ దొడ్డ రామకృష్ణ ఏ4గా ఉన్నారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నల్లపనేని చలపతిరావును విడదల రజిని తన వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణ ద్వారా రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని.. ఈ వ్యవహారంలో పల్లె జాషువా, రజిని మరిది గోపితో పాటు మరికొందరు పాలుపంచుకున్నారని విచారణలో తేలిసింది.
అన్ని అనుమతులతోనే మైనింగ్ చేస్తుండటంతో మొదట డబ్బులు ఇచ్చేందుకు చలపతిరావు నిరాకరించారు. దాంతోఐపీఎస్ అధికారి జాషువా విజిలెన్స్ తనిఖీలు చేయించి.. రూ.50 కోట్లు ఫైన్ వేయిస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. తప్పని పరిస్థితుల్లో రెండు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు చలపతిరావు బేరం కుదుర్చుకున్నారు. ఆ డబ్బులను స్వయంగా మంత్రి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చారు. ఆ తర్వాత తమకు చెరో పది లక్షలు ఇవ్వాలంటూ చలపతిరావును గోపి, జాషువా డిమాండ్ చేయగా.. వారికి కూడా అడిగిన మొత్తం అందజేశారు.
అయితే గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితుడు చలపతిరావు తన వద్ద అక్రమంగా డబ్బులు తీసుకున్న మాజీ మంత్రి విడదల రజిని, జాషువా, గోపీలపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అనంతరం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏసీబీ విచారణ జరిపింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ చేయించిన దర్యాప్తులో పలు కీలక ఆధారాలు లభించడంతో తాజాగా నిందుతులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రజిని ఏ1గా ఉండటంతో ఆమెకు అరెస్ట్ ముప్పు ఉందని అంటున్నారు.