ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల రేంజ్ పాన్ ఇండియా రేంజ్ కు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. బాహుబలితో మొదలైన ఈ ప్రస్థానం తాజాగా కేజీఎఫ్-2 వరకు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. దక్షిణాది దూకుడు ముందు బాలీవుడ్ బెంబేలెత్తుతోంది. బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వంటి సౌత్ సినిమాల తాకిడికి బాలీవుడ్ బడాహీరోలు కూడా బలాదూర్ అన్నారు. బాలీవుడ్ సినిమాలలో హీరోయిజం తగ్గిందని, అందుకే ఆ సినిమాలు దక్షిణాది సినిమాలతో పోటీపడలేకపోతున్నాయని సల్మాన్ ఖాన్ కూడా అన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అయితే, సల్మాన్ లా ప్రశంసలు మాత్రమే కాకుండా…దక్షిణాది చిత్రాల సక్సెస్ ను ఓర్చుకోలేని బాలీవుడ్ హీరోలు కూడా కొందరున్నారు. తాజాగా ఈ కోవలోనే బాలీవుడ్ బిగ్ బీ తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ పాన్ ఇండియా సినిమాలపై స్పందించాడు. అలాంటి వాటిని తాను నమ్మనని అభిషేక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాన్ ఇండియా అన్న పదమే తప్పని, పాన్ ఇండియా అనే వర్గీకరణ మాత్రం మంచిది కాదని, అసలు పాన్ ఇండియా అంటే ఏంటంటూ ప్రశ్నించాడు అభిషేక్.
‘‘మరేదైనా ఇండస్ట్రీకి ఆ పదాన్ని వాడుతున్నామా? లేదే. మన దగ్గర సినీ అభిమానులు చాలా ఎక్కువగా ఉన్నారు. మన వాళ్లకు సినిమా అంటే పిచ్చి. కాబట్టి సినిమాకు భాషతో పనిలేదు. ఏ భాషైనా అంతిమంగా సినిమానే’’ అని అభిషేక్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. వివిధ భాషల్లో పనిచేసినా.. అందరం భారత సినీ పరిశ్రమలో భాగమేనని స్మాల్ బీ పేర్కొన్నాడు. దక్షిణాది సినిమాలు బాలీవుడ్ లో విడుదల కావడం మంచి పరిణామమని వ్యాఖ్యానించాడు. సినిమా బాగుంటే ఎక్కడైనా నడుస్తుందని, చెత్తగా ఉంటే ఫ్లాప్ అవుతుందని అన్నాడు.
అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ మంచి కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయని పేర్కొన్నాడు. బాలీవుడ్ సినిమాల్లో కంటెంట్ లేదనడం సరికాదని వ్యాఖ్యానించాడు. దురదృష్టం కొద్దీ గంగుభాయ్ కథియావాడీ, సూర్యవంశీ సినిమాలను అసలు ప్రస్తావించడం లేదని అన్నాడు. ఏదైనా అంతిమంగా ప్రేక్షకులను సినిమాతో అలరించామా? లేదా? అన్నదే ముఖ్యమని తెలిపాడు. హిందీ సినిమాలూ దక్షిణాదిలో మంచి విజయాన్ని నమోదు చేశాయని గుర్తు చేశాడు.